​​​​​​కరోనా విజృంభించిన కౌంటీల్లో ట్రంప్‌కే మద్దతు!

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాల్లో కరోనా మహమ్మారి చాలా కీలకమైంది. దీన్ని కట్టడి చేయడంలో అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలూ వెల్లువెత్తాయి. కానీ, అమెరికా ప్రజల తీర్పు మాత్రం కాస్త విలక్షంగా ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ) విశ్లేషించింది...

Updated : 06 Nov 2020 14:57 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాల్లో కరోనా మహమ్మారి చాలా కీలకమైంది. దీన్ని కట్టడి చేయడంలో అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలూ వెల్లువెత్తాయి. కానీ, అమెరికా ప్రజల తీర్పు మాత్రం కాస్త విలక్షణంగా ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ) విశ్లేషించింది. ప్రస్తుతం కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న కౌంటీల్లో ట్రంప్‌నకు భారీ మద్దతు లభించినట్లు పేర్కొంది. 

అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ప్రకారం.. తలసరి కొత్త కేసులు అత్యధికంగా ఉన్న 376 కౌంటీలలో.. 93 శాతం ట్రంప్‌ వైపే మొగ్గుచూపాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కౌంటీలతో పోలిస్తే ఇక్కడ ట్రంప్‌నకు భారీ మద్దతు లభించింది.  డకోటా రాష్ట్రాలు, మోంటానా, నెబ్రాస్కా, విస్కాన్సిన్, అయోవాలోని గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుత అధ్యక్షుడికి బాసటగా నిలిచాయి. 95 శాతం ప్రాంతాల్లో అధికారిక కేసులు నమోదైన కౌంటీలను మాత్రమే ఏపీ పరిగణనలోకి తీసుకుంది. ప్రతి లక్ష మందికి నమోదైన కేసుల ఆధారంగా ఆ కౌంటీలను ఆరు వర్గాలుగా విభజించి విశ్లేషించింది.

దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణపై ఓటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రంప్‌ మద్దతుదారుల్లో 36 శాతం మంది ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచినట్లు ఏపీ నిర్వహించిన ఓట్‌క్యాస్ట్‌ సర్వేలో తేలింది. మరో 47 మంది ఫరవాలేదని తేల్చారు. ఇక బైడెన్‌ వర్గీయుల్లో 82 శాతం మంది కరోనా నియంత్రణలో లేదని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా ఉన్న అలబామా, మిస్సౌరీ, మిస్సిసిపీ, కెంటకీ, టెక్సాస్‌, టెన్నెసీ, సౌత్‌ కరోలైనా రాష్ట్రాల్లో కరోనా అదుపులో ఉందని  ప్రజలు తెలిపారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కరోనా విజృంభించిన విస్కాన్సిన్‌లో 57 శాతం మంది ప్రజలు మహమ్మారి అదుపులో లేదని తెలిపారు. తొలినాళ్లలో విజృంభించి ప్రస్తుతం నియంత్రణలో ఉన్న న్యూ హాంప్‌షైర్‌, న్యూయార్క్‌ రాష్ట్రాల్లోనూ ప్రజలు మహమ్మారి నియంత్రణపై రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక ట్రంప్‌ మద్దతుదారుల్లో చాలా మంది కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఒక అధ్యక్షుడు చేయాల్సిందంతా ఆయన చేశారని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
లీగల్‌ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్‌

ట్రంప్‌ అనుకున్నదంతా అవుతోంది..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని