చరిత్ర సృష్టించి తిరిగొస్తున్న క్రూడ్రాగన్‌!

తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన వ్యోమగాములు తిరుగుపయనమయ్యారు. శనివారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి క్రూడ్రాగన్‌ వ్యోమనౌకలో ప్రయాణం ప్రారంభించారు.........

Published : 02 Aug 2020 10:42 IST

వాషింగ్టన్‌: తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన వ్యోమగాములు తిరుగుపయనమయ్యారు. శనివారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి క్రూడ్రాగన్‌ వ్యోమనౌకలో ప్రయాణం ప్రారంభించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:35 గంటలకు వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయి భూమి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 

వాతావరణం అనుకూలించకపోయినా..

మానవసహిత అంతరిక్ష యాత్రల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ ప్రైవేటు కంపెనీ స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన క్రూడ్రాగన్‌ వ్యోమనౌకలో తొలిసారి వ్యోమగాములు బాబ్‌ బెంఖెన్‌, డగ్‌ హార్లీలు మే 30న రోదసీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన అనంతరం వారు భూమి పైకి తిరుగుపయనమయ్యారు. 19 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం వారు ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో ల్యాండ్‌ కానున్నారు. వారు భూమిపైకి చేరుకోవడానికి అనువుగా ఉండే మొత్తం ఐదు ప్రాంతాల్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణం అనుకూలిస్తుందన్న అంచనాలతో క్రూడ్రాగన్‌ రాకకు అనుమతించారు. ఒకవేళ వాతావరణం సహకరించనట్లైతే.. ల్యాండింగ్‌ని వాయిదా వేస్తామని నాసా అధికారులు తెలిపారు. మూడు రోజులకు కావాల్సిన అన్ని వసతులు క్రూడ్రాగన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. 

వ్యోమగాములతో పాటు 150 కిలోల బరువు..

ఇద్దరు వ్యోమగాములతో పాటు 150 కిలోల బరువును కూడా క్రూడ్రాగన్‌ మోసుకొస్తోంది. దీంట్లో ఎక్కువగా.. బయోలాజికల్‌ శాంపిల్స్‌, పరిశోధనలకు సంబంధించిన కాగితాలు ఉన్నట్లు నాసా తెలిపింది. అలాగే 2011లో అప్పటి వ్యోమగాములు వదిలి వచ్చిన అమెరికా జాతీయ జెండాను తిరిగి భూమిపైకి తీసుకురానున్నారు. వాణిజ్య అంతరిక్ష యాత్ర లక్ష్యానికి గుర్తుగా ఆరోజు వారు ఆ పతాకాన్ని అక్కడ వదిలి వచ్చారు. నేడు ఆ లక్ష్యం నెరవేరిన సందర్భంగా తిరిగి దాన్ని భూమిపైకి తీసుకొస్తున్నారు. అలాగే 2019లో ప్రయోగాత్మకంగా పంపిన క్రూడ్రాగన్‌ డెమో-1 తీసుకెళ్లిన ‘ఎర్తీ’ అనే బొమ్మ కూడా తిరిగి రానుంది. తాజా యాత్రలో ‘జీరో-జీ ఇండికేటర్‌’గా ఉపయోగించిన డైనోసార్‌ బొమ్మను కూడా తీసుకొస్తున్నారు.

క్రూడ్రాగన్‌ రోదసీ ప్రయోగంలో భారత్‌కు చెందిన ఇంజినీర్‌ బలరామమూర్తి ప్రముఖ పాత్ర పోషించారు. చెన్నైకి చెందిన ఆయన.. 9 ఏళ్లుగా స్పేస్‌ఎక్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. మానవసహిత యాత్ర సామర్థ్యమున్న వాహకనౌక అభివృద్ధి, పనితీరు నిర్ధారణలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. తాజా ప్రయోగంలో ఆయన చీఫ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని