Updated : 10/03/2021 10:36 IST

మన జలాంతర్గాముల సత్తా ఇక అపారం

కీలకమైన ఏఐపీ పరిజ్ఞానాన్ని సిద్ధం చేసిన డీఆర్‌డీవో 
అగ్రరాజ్యాల సరసన భారత్‌ 

దిల్లీ: డీజిల్‌తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను ఎన్నో రెట్లు పెంచే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇందుకు అవసరమైన ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) అభివృద్ధిలో ఒక ముఖ్య మైలురాయిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిగమించింది. ముంబయిలో నేలపై ఏర్పాటు చేసిన ఒక పరీక్షా వేదికపై ఇది సమర్థతను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నౌకాదళం కోరిన రీతిలో దీన్ని ఎండ్యూరెన్స్, గరిష్ఠ శక్తి మోడ్‌లలో విజయవంతంగా పరీక్షించినట్లు వివరించింది. దీని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డీఆర్‌డీవో, భారత నౌకాదళం, పరిశ్రమలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌ రెడ్డి అభినందించారు. 

మన పరిజ్ఞానం చాలా ప్రత్యేకం.. 
ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఏఐపీలు అందుబాటులో ఉన్నాయి. డీఆర్‌డీవో రూపొందించిన ఏఐపీ ఫాస్పారిక్‌ యాసిడ్‌ ఫ్యూయెల్‌ సెల్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జలాంతర్గామిలోనే హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. డీఆర్‌డీవోకు చెందిన నేవల్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్‌) దీన్ని అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్‌ సాయంతో నిర్మిస్తున్న స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాముల్లో దీన్ని అమరుస్తారు. 
అణు జలాంతర్గామి కన్నా నిశ్శబ్దంగా  
అణు జలాంతర్గామికి దీర్ఘకాలం పాటు నీటి అడుగునే ఉండే సామర్థ్యం ఉన్నప్పటికీ అందులోని రియాక్టర్‌ నుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతుంటాయి. శత్రు నౌకాదళం ఆ ధ్వనులను గుర్తించే ప్రమాదం ఉంది. ఏఐపీ కలిగిన సంప్రదాయ జలాంతర్గామిలో ఇలాంటి శబ్దాలు వెలువడవు. అందువల్ల అది శత్రువుకు దొరికే అవకాశం తక్కువ. 
పాక్‌ యత్నాలు.. 
పాకిస్థాన్‌ కూడా ఏఐపీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తన వద్ద ఉన్న ‘అగోస్టా 90బి’ తరగతి జలాంతర్గాములకు వీటిని అమర్చాలన్న పాక్‌ విజ్ఞప్తిని ఫ్రాన్స్‌ను తిరస్కరించింది. దీంతో చైనా నుంచి వాటిని పొందేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోంది. 

ఏమిటీ ఏఐపీ? 
అణుశక్తితో నడిచే జలాంతర్గాములు దీర్ఘకాలం నీటి అడుగున ఉండగలవు. సంప్రదాయ డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములకు ఆ సామర్థ్యం ఉండదు. బ్యాటరీల ఛార్జింగ్‌ కోసం తరచూ అవి సముద్ర ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. దీనివల్ల వాటి పోరాట సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్యను ఏఐపీ పరిష్కరిస్తుంది. ఫలితంగా.. డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు ఏకబిగిన నీటి అడుగున ఉండగలిగే సమయం ఎన్నో రెట్లు పెరుగుతుంది. వాటి పోరాట పటిమ కూడా పెరుగుతుంది. అత్యంత కీలకమైన ఏఐపీ పరిజ్ఞానం.. అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల వద్ద మాత్రమే ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని