Updated : 02/07/2021 11:21 IST

Modi: కొవిడ్‌ అనుభవాలను అక్షరబద్ధం చేయండి

 వైద్యులకు ప్రధాని మోదీ పిలుపు

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరాడుతున్న తీరును, ఈ క్రమంలో ఎదురవుతున్న అనుభవాలను అక్షరబద్ధం (డాక్యుమెంటేషన్‌) చేయాలని వైద్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఆ రికార్డులను భద్రపర్చాలని సూచించారు. వైరస్‌ విషపు కౌగిలి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) డాక్టర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని గురువారం ప్రసంగించారు. ‘‘2014 వరకు దేశంలో కేవలం 6 ఎయిమ్స్‌ ఆస్పత్రులు ఉండేవి. మేం 15 కొత్త ఎయిమ్స్‌ల పనులు ప్రారంభించాం. వైద్య కళాశాలల సంఖ్యను 1.5 రెట్లు పెంచాం. అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లలోనూ అంతేస్థాయిలో వృద్ధి నమోదైంది. పీజీ సీట్లలో 80% పెరుగుదల కనిపించింది. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని యువత కూడా డాక్టర్లుగా మారేందుకు అవకాశం లభిస్తుంది. వైద్యరంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్లకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అన్నారు.

దేశం రుణపడి ఉంటుంది: రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి వేళ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజల ప్రాణాలను రక్షించారని, వారికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

డిజిటల్‌ ఇండియాది కీలక పాత్ర

దేశంలో యువ శక్తి, సాంకేతిక సామర్థ్యం, సమాచారాల కలయికతో అపార అవకాశాలు ఏర్పడనున్నాయని, ఈ దశాబ్దం భారత సాంకేతిక యుగంగా మారనుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్‌ ఇండియాకు ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమంలో డిజిటల్‌ ఇండియా పథకాల లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. భారత్‌ ఓ సమాచార నిధి (డేటా పవర్‌హౌస్‌)గా మారిందని, సమాచార పరిరక్షణకు బాధ్యతాయుత చర్యలు చేపడుతోందని మోదీ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఆరోగ్య సేతు యాప్‌ కీలక పాత్ర పోషించిందని, కొవిన్‌ యాప్‌పై ఎన్నో దేశాలు ఆసక్తి చూపాయని చెప్పారు. భారత్‌ సాంకేతిక సత్తాకు ఇదే నిదర్శనమన్నారు. వేగవంతమైన ప్రగతికి డిజిటల్‌ ఇండియా సూచికగా నిలిచిందన్నారు. 5జీ సాంకేతికత ఫలాలను అందుకోవడానికి భారత్‌ సిద్ధమవుతోందన్నారు. కృత్రిమ మేధ, బ్లాక్‌ చైన్‌ లాంటి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తన ప్రసంగంలో తెలిపారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని