కరోనా టెస్ట్‌: ఏదో బోగస్‌ జరుగుతోంది!

ర్యాపిడ్‌ టెస్టులపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యాలు చేశారు.

Published : 13 Nov 2020 16:52 IST

ర్యాపిడ్‌ టెస్టులపై ‘టెస్లా సీఈఓ’ అనుమానాలు..!

వాషింగ్టన్‌: అనతికాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టేసిన కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పరీక్షలను చేపడుతున్నారు. అయితే, కరోనా నిర్థారణ పరీక్షల ఫలితాలు కచ్చితంగా రాకపోవడం ప్రస్తుతం ఓ సవాల్‌గా మారింది. దీంతో కొవిడ్‌ టెస్టుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు వైరస్‌ను కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వార్తలు వాటి విశ్వాసాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ ర్యాపిడ్‌ టెస్టులపై తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కూడా కీలక వ్యాఖ్యాలు చేశారు.

‘ఏదో తీవ్రమైన బోగస్‌ జరుగుతోంది. ఓకే రోజు నాలుగు సార్లు టెస్టులు చేయించుకున్నాను. వీటిలో రెండు టెస్టుల్లో నెగెటివ్‌, మరో రెండు టెస్టులు పాజివివ్‌ వచ్చాయి. ఒకే మిషిన్‌, ఒకే పరీక్ష, ఒకే నర్సు’ అంటు కరోనా టెస్టుపై ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా స్పందించారు. ఓ ల్యాబ్‌లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు భిన్నంగా రావడంతో మరో ల్యాబ్‌లో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కూడా చేయించుకున్నానని, ఆ ఫలితం కోసం వేచిచేస్తున్నట్లు మస్క్‌ ట్విటర్‌లో వెల్లడించారు. మీకు ఏమైనా కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయా? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ‘సాధారణ జలుబు’ ఉన్నట్లు ఎలాన్‌ మస్క్‌ సమాధానమిచ్చారు. అయితే, అంతగా ఇబ్బంది లేదని ఆయన స్పష్టంచేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు..

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వైరస్‌ లక్షణాలు ఉన్నవారితోపాటు, వైరస్‌ బయటపడిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారి ద్వారా వైరస్‌ సోకిన వారిని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమయంలో ఆర్‌టీ-పీసీఆర్‌తో పాటు త్వరగా ఫలితమిచ్చే ర్యాపిడ్‌ యాంటీజెన్ టెస్టులను వాడుతున్నారు. అయితే, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు దాదాపు కచ్చితంగానే ఉంటున్నప్పటికీ.., ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల ఫలితం ఆశించినంతగా లభించడంలేదని నిపుణులు ఇప్పటికే స్పష్టంచేస్తున్నారు. అందుకే ర్యాపిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చిన వారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితమైన ఫలితమిచ్చే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ మధ్యే ప్రముఖ నటుడు చిరంజీవి కూడా కరోనా టెస్టుల్లో తొలుత పాజిటివ్‌గా వచ్చినప్పటికీ.. మరోసారి చేసిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఆ రెండూ నాతో ఆడేసుకున్నాయ్‌: చిరంజీవి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని