Published : 16/11/2020 13:07 IST

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ట్యాక్సీ!

కేప్‌ కార్నివాల్‌(అమెరికా): అంతరిక్షయాన చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నలుగురు వ్యోమగాముల్ని మోసుకెళ్తూ ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్మించిన వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.  ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఫాల్కన్‌ వాహకనౌక నింగిలోకి ఎగిరింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి చేరుకోనుంది.

అంతరిక్షయానాల కోసం ప్రైవేట్‌ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం.. భవిష్యత్తు అంతరిక్షయానాలకు స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌకల్ని అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిర్మించిందే ఈ ‘క్రూ డ్రాగన్‌’. మేలో దీన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి రెండు నెలల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చారు. ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్‌ఎక్స్‌ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాలకు నాసా అనుమతించింది. నేడు జరిగిన ప్రయోగం రోదసీయాన చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్షయానంగా చెప్పవచ్చు. ఒకరకంగా అంతరిక్షంలోకి ట్యాక్సీ సర్వీసులు ప్రారంభమైనట్లే. ఇకపై అమెరికాకు భారీగా బడ్జెట్‌ ఆదా కానుంది. 2011 తర్వాత అమెరికా తమ సొంత సొంత వ్యోమనౌకల్ని ఉపయోగించడం నిలిపివేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయుజ్‌లో తమ వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు పంపుతోంది. దీనికి భారీగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు తాజాగా ఫాల్కన్‌ రాకెట్‌లో ఉపయోగించిన తొలి దశ బూస్టర్‌ని మరోసారి వినియోగించేలా నిర్మించారు.

ఈ ప్రయోగంతో అంతరిక్షయాన చరిత్రలో ఓ కొత్తం శకం ప్రారంభమైందని నాసా తెలిపింది. ఇక నుంచి భూదిగువ కక్ష్యలోకి తరచూ జరిగే అంతరిక్షయానాలకు ఓ ప్రైవేటు సంస్థ సేవలనందించనుందని పేర్కొంది. అమెరికాకు చెందిన మైఖేల్‌ హాప్‌కిన్స్‌, విక్టర్‌ గ్లోవర్‌, శాన్నన్‌ వాకర్‌తో పాటు సోయిచి నోగుచి అనే అత్యంత అనుభవజ్ఞుడైన జపాన్‌ వ్యోమగామి తాజాగా ఐఎస్‌ఎస్‌కు బయలుదేరారు. ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన కేట్‌ రూబిన్స్‌, రష్యాకు చెందిన సెర్గీ రిజికోవ్‌, సెర్గీ కుడ్‌- స్వేర్చ్‌కోవ్‌‌ ఉన్నారు. తాజాగా వెళ్లిన వ్యోమగాములు మొత్తం నాలుగు సార్లు స్పేస్‌వాక్‌ చేయాల్సి ఉంది. యూకేకు చెందిన ఎండీయే రూపొందించిన ‘కోకా కమ్యూనికేషన్స్‌ టెర్మినల్‌’ను ఐఎస్‌ఎస్‌లోని ఐరోపా స్పేస్‌ మాడ్యూల్‌ కొలంబస్‌కు బిగించనున్నారు. దీని ద్వారా అక్కడ ఉన్న వ్యోమగాములు భూమిపై ఉండే బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌తో ఇక్కడి శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులతో ముచ్చటించవచ్చు.

తాజా ప్రయోగాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆయన సతీమణితో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. అధ్యక్షుడు ట్రంప్‌ నాసా, స్పేస్‌ఎక్స్‌ కృషిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ ప్రయోగం శాస్త్రవిజ్ఞానానికి ఉన్న శక్తికి నిదర్శనం. అలాగే, మన వినూత్నత, చతురత, సంకల్పం ద్వారా ఏదైనా సాధించగలం అనడానికి ఉదాహరణ’’ అని వ్యాఖ్యానించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని