ట్రంప్‌ నాతో తప్పుగా ప్రవర్తించారు..

డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అమెరికాకు చెందిన ఓ మాజీ మోడల్‌ ఆరోపించారు.

Published : 18 Sep 2020 14:55 IST

మాజీ మోడల్‌ ఆరోపణ

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అమెరికాకు చెందిన ఓ మాజీ మోడల్‌ ఆరోపించారు. ఆయన తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు చోటుచేసుకోవటం గమనార్హం.

1997 యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ పోటీలు న్యూయార్క్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అమీడోరిస్‌ అనే ఈ మాజీ మోడల్‌ వివరించారు. ఆ సమయంలో తాను ట్రంప్‌ను వారించినా.. అతను పట్టించుకోలేదని తెలిపారు. ఈ సంఘటన జరిగిందని చెబుతున్న సమయానికి డోరిస్‌ వయసు 24 కాగా.. ట్రంప్‌ వయస్సు 51. అప్పటికే ఆయనకు మార్లా మేపుల్స్‌తో ద్వితీయ వివాహం జరిగింది.
ఈ ఆరోపణను ట్రంప్‌ తీవ్రంగా ఖండిస్తూ తన న్యాయవాది ద్వారా ప్రకటన విడుదల చేశారు. తాను ఆమెపై ఎప్పుడూ వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. డోరిస్‌ చెప్పిన విషయాలు నమ్మదగినవిగా లేవని.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లయితే అందుకు సాక్షులు ఉండేవారని అన్నారు. ఈ విమర్శలు రాజకీయ ప్రోద్బలంతో జరిగినవని.. ట్రంప్‌ ప్రకటనలో కొట్టిపారేశారు.
ట్రంప్‌పై ఇప్పటి వరకు 25మందికి పైగా మహిళలు బహిరంగ ఆరోపణలు చేశారు. అయితే, తనపై వచ్చిన ప్రతి ఆరోపణను అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. అసలు వారిలో కొందరిని  ఎప్పుడూ కలవనే లేదని ఆయన అన్నారు. కాగా, వారిలో కొందరైతే తనకు ఏమాత్రం ఆకర్షణీయంగా అనిపించలేదని పేర్కొనటం కొసమెరుపు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని