గల్వాన్‌ ఘటన దురదృష్టకరం: చైనా

సరిహద్దులో 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలితీసుకున్న గల్వాన్‌ ఘర్షణను చైనా ‘దురదృష్టకర సంఘటన’గా అభివర్ణించింది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా ఈ పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం.........

Updated : 26 Aug 2020 11:28 IST

రెండు నెలల తర్వాత డ్రాగన్‌ పశ్చాత్తాప వ్యాఖ్యలు

దిల్లీ: సరిహద్దులో 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలితీసుకున్న గల్వాన్‌ ఘర్షణను చైనా ‘దురదృష్టకర సంఘటన’గా అభివర్ణించింది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా ఈ పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనల్ని ఇరు దేశాలూ కోరుకోవడం లేదని భారత్‌లోని ఆ దేశ రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ‘ఇండియా-చైనా యూత్‌ ఫోరం’ ఆగస్టు 18న నిర్వహించిన వెబినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం వెల్లడించింది. 

గల్వాన్‌ లాంటి దురదృష్టకర ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. అందుకు సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా పలు దఫాలు ఇరు దేశాల సైనికాధికారులు జరిపిన చర్చలు- వాటి ఫలితంగా చోటుచేసుకున్న పరిణామాల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్న భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. వివాదాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉందన్నారు.  

భారత్‌ను చైనా ప్రత్యర్థిగా కాకుండా ఓ మిత్రదేశంగా.. ముప్పుగా కాకుండా ఓ అవకాశంగా భావిస్తోందని వీడాంగ్‌ చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సరిహద్దు వివాదాల్ని సైతం పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు. చైనా దురాక్రమణను చవిచూసిన తర్వాత భారత్‌లో పెరిగిన స్వయంసమృద్ధి నినాదాన్ని సన్‌ వీడాంగ్‌ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ యుగంలో స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన సంబంధాలు తాజాగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకునేందుకు దోహదం చేస్తాయని వీడాంగ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని