జర్మనీలో లాక్‌డౌన్‌ ఆంక్షలు!

గడిచిన కొన్ని వారాలుగా వైరస్‌ తీవ్రత పెరగడంతో జర్మనీ మరోసారి ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. 

Published : 14 Dec 2020 01:56 IST

బెర్లిన్‌: కరోనా వైరస్‌ విజృంభణతో యూరప్‌ దేశాలు వణికిపోతున్నాయి. గడిచిన కొన్ని వారాలుగా వైరస్‌ తీవ్రత పెరగడంతో జర్మనీ మరోసారి ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్టోర్లు, పాఠశాలలు మూసివేతకు జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ఆదేశించారు. అంతేకాకుండా భౌతిక దూరం నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రానున్న నెలరోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ సమావేశమై చర్చించారు. అనంతరం డిసెంబర్‌ 16 నుంచి జనవరి 10 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో గుమి కూడకుండా ఆంక్షలు విధించారు. పండగ వేళ ఇండోర్‌ ప్రదేశాల్లో కేవలం ఐదుగురిని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు పండగ వేళ సంప్రదాయకంగా కాల్చే బాణసంచాపై కూడా నిషేధం విధించారు. ‘ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’ అని  మెర్కల్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యాయని..దీంతో మరిన్ని కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేయాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ఆదివారం ఒక్కరోజు జర్మనీలో 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడగా 321మంది మృత్యువాతపడ్డారు. ఇక వారాంతంలో ఈ సంఖ్య భారీగా ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 13లక్షల మంది వైరస్‌ బయటపడగా 22వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..
ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం..డీకోడ్‌ చేసిన శాస్త్రవేత్తలు
భారత్‌లో కోలుకుంటున్న వారే అధికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని