
హైకోర్టు పర్యవేక్షణలోనే హాథ్రస్ కేసు విచారణ
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ జరుపుతున్న విచారణను ప్రస్తుతానికి అలహాబాద్ హైకోర్టే పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర కోణాలను సైతం హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షుల భద్రతను కూడా హైకోర్టే పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. కేసు విచారణను ఉత్తర్‌ప్రవేశ్ వెలుపల దిల్లీలోని ఓ కోర్టులో జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపైనా, సీబీఐ విచారణపైనా తమకు నమ్మకం లేదని.. ఈ కేసును సుప్రీంకోర్టే స్వీకరించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పర్యవేక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది.