Updated : 11/11/2020 12:43 IST

అమెరికాలో 24 గంటల్లో 2లక్షల కేసులు

నిండుతున్న ఆస్పత్రులు.. ప్రజలకు ఫౌచీ సలహా

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు మిలియన్‌కు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా ఉంటుండడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో మరణాలూ తీవ్ర స్థాయిలో పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

24 గంటల్లో 2లక్షల కేసులు..

జాన్స్‌ హాప్‌కిన్స్‌ గణాంకాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 8:30గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 2,01,961 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య  ప్రస్తుతం 1,02,38,243కి పెరిగింది. మరో 1,535 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 2,39,588కి చేరింది. గత వారాంతపు సమాచారం అందడంలో జాప్యం జరగడమే అధిక కేసుల నమోదుకు కారణమని సమచారం. రాబోయే రెండు నెలల్లో మరో 1,10,000 మంది చనిపోయే అవకాశం ఉందని వాషింగ్టన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌’ అంచనా వేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 61,694కి చేరింది. రోజుకి సగటున 1,661 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. మంగళవారం నాటికి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య క్రితం వారంతో పోలిస్తే 10 శాతం పెరిగింది. దాదాపు 44 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.  

ఫౌచీ సలహా..

అమెరికా కొవిడ్‌ విజృంభణపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. కొంతకాలం ఎక్కడి వారు అక్కడే ఉంటూ తమ పనుల్ని చక్కబెట్టుకోవాలన్నారు. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ రాబోతోందన్నారు. అప్పటి వరకు కొవిడ్‌ నిబంధనల్ని పాటించాలని హితవు పలికారు. సామాజిక దూరం, మాస్క్‌ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, గుమిగూడకుండా ఉండడం వంటి నియమాల్ని పాటించాల్సిందేనని చెప్పారు.

డిసెంబరు చివరికి వ్యాక్సిన్‌..

కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వారికి డిసెంబరు నాటికి వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉందని అమెరికా ‘హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ సెక్రటరీ అలెక్స్‌ అజర్‌ తెలిపారు. తమ టీకా 90 శాతం సత్ఫలితాలిస్తోందని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ ఫైజర్‌ ప్రకటించిన నేపథ్యంలో అజర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫైజర్‌ సంస్థకు నెలకి 20 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆ ప్రకారం నవంబరు నెలాఖరున తయారీ ప్రారంభించినా.. డిసెంబరు చివరికి టీకా అందుతుందని తెలిపారు. అలాగే, వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న మరో సంస్థ మోడెర్నా ఇప్పటికే టీకా తయారీని ప్రారంభించిందని గుర్తుచేశారు. అయితే, రెండు డోసుల్లో ఇవ్వాల్సిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కొంత సవాల్‌తో కూడుకున్న అంశమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని