చైనాకు ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు

దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత చైనాకు లేదని భారత్‌ స్పష్టంచేసింది. సరిహద్దుల్లో 44 బ్రిడ్జిలను నిర్మించడంపై చైనా లేవనెత్తిన అభ్యంతరాలపై ఆ దేశానికి ఘాటుగా......

Published : 15 Oct 2020 19:29 IST

లద్దాఖ్‌పై డ్రాగన్‌ వ్యాఖ్యలకు భారత్‌ కౌంటర్‌

దిల్లీ: దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత చైనాకు లేదని భారత్‌ స్పష్టంచేసింది. సరిహద్దుల్లో 44 బ్రిడ్జిలను నిర్మించడంపై చైనా లేవనెత్తిన అభ్యంతరాలపై ఆ దేశానికి ఘాటుగా బదులిచ్చింది. లద్దాఖ్‌ సహా, జమ్మూకశ్మీర్ కూడా ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టంచేసింది.

సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా నిర్మించిన 44 బ్రిడ్జిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల ప్రారంభించడంపై చైనా అభ్యంతరాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను ఏర్పాటు చేయడాన్ని తాము ఏమాత్రం అంగీకరించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌ను కూడా భారత భూభాగమని పేర్కొనడాన్ని సహించబోమని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మౌలిక వసతులు ఏర్పాటే ఇరు దేశాల మధ్య విభేదాలకు కారణమని వ్యాఖ్యానించారు.

చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ ముమ్మాటికీ దేశంలో అంతర్భాగమేనని ఆ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ స్పష్టంచేశారు. ‘‘అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో భారత్‌ వైఖరిని వివిధ సందర్భాల్లో, వివిధ వేదికలపై స్పష్టం చేశాం. ప్రజల జీవనోపాధిని పెంచేందుకు, ప్రజల సంక్షేమం కోసం దేశంలో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా సరిహద్దులో మౌలిక వసతుల కల్పన భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా అవవసరం’’ అని నొక్కి చెప్పారు. దేశ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యాన్ని తాము సహించబోమని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని