‘కరాచీ భారత్‌లో భాగమవుతుంది’

‘అఖండ భారతం’ మీద నమ్మకం ఉందని, ఏదో ఒకరోజు కరాచీ భారత్‌లో భాగమవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

Updated : 23 Nov 2020 13:54 IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌

ముంబయి: ‘అఖండ భారతం’ మీద నమ్మకం ఉందని, ఏదో ఒకరోజు కరాచీ భారత్‌లో భాగమవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరాచీ స్వీట్‌ షాపు పేరులోని కరాచీని తొలగించాలని ముంబయిలోని ఓ స్వీట్‌ షాపు యజమానిని ఓ శివసేన నేత బెరిదించిన అనంతరం ఫడణవీస్‌ ఈ విధంగా స్పందించారు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో కరాచీ స్వీట్‌ షాప్‌ పేరుతో ఓ మిఠాయి దుకాణం ఉంది. కాగా శివసేన నేత నితిన్‌ నంద్‌గావోకర్‌ ఆ దుకాణం పేరులోని కరాచీని తొలగించి దాని స్థానంలో మరాఠీలో ఏదైనా పేరు పెట్టుకోవాలంటూ యజమానిని హెచ్చరించాడు. కొద్ది రోజుల సమయం ఇస్తున్నానని అంతలోపు దుకాణం పేరు మార్చుకోవాలని పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై స్పందించిన దేవేంద్ర ఫడణవీస్‌ అఖండ భారతం మీద విశేష నమ్మకం ఉందని, కరాచీ ఏదో ఒకరోజు భారత్‌లో కలుస్తుందనే నమ్మకం కూడా ఉందని విలేకర్లతో పేర్కొన్నారు.

అది మా వైఖరి కాదు
ఈ వివాదంపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. వాటి పేర్లను మార్చాలనే డిమాండ్ తమ పార్టీ వైఖరి కాదన్నారు. ‘గత 60 ఏళ్లుగా ముంబయిలో కరాచీ బేకరీ, కరాచీ స్వీట్ల పేరుతో దుకాణాలు ఉన్నాయి. ఆ యజమానులకు పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు వాటి పేర్లను మార్చమని అడగడానికి అర్థమే లేదు. వాటి పేర్లు మార్చాలన్నది శివసేన వైఖరి కాదు’ అని రౌత్‌ వివరణ ఇచ్చారు.

భారత్‌, పాక్‌ బంగ్లాదేశ్ కలిసిపోవాలి
దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యలకు మహారాష్ట్ర మంత్రి, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ మద్దతు పలికారు. మూడు దేశాల విలీనానికి భాజపా ముందడుగు వేస్తే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. ‘ఏదో ఒకరోజు కరాచీ భారత్‌లో భాగమవుతుందని ఫడణవీస్‌ అన్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను విలీనం చేయాలని మేము ఎప్పటినుంచో కోరుతున్నాం. బెర్లిన్‌ గోడ కూల్చేసి ప్రజలు ఏకమైనప్పుడు భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఎందుకు కలిసిపోలేవు?’ అని మాలిక్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని