బైడెన్‌తోనైనా కలిసి పని చేస్తా: ఓబ్రియాన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు వృత్తిపరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రోబర్ట్ ఓబ్రియాన్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ ఓవైపు ట్రంప్‌ కోర్టుమెట్లెక్కిన నేపథ్యంలో..

Published : 17 Nov 2020 12:31 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ ఓవైపు ట్రంప్‌ కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఓబ్రియాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ కీలక బాధ్యతల్లో ఉన్న ఓబ్రియాన్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

గ్లోబల్‌ సెక్యూరిటీ ఫోరంలో ఓబ్రియాన్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌ మరో నాలుగేళ్లు ఆ పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెబుతూనే... ఒక వేళ నూతనంగా ఎన్నికైన జో బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినా, వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కాస్త కుదురుకొని వారి విధానాలను అమలు చేసేందుకు సమయం పడుతుంది. ప్రభుత్వమేదైనా ఇప్పటిలాగే బాధ్యతలను నిర్వర్తిస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు’’ అని ఓబ్రియాన్‌ స్పష్టం చేశారు. బైడెన్‌ కొత్తగా ఫ్రొఫెషనల్‌ నేషనల్‌ సెక్యూరిటీ టీంను సిద్ధం చేసుకునే అవకాశముందని ఓబ్రియాన్‌ తెలిపారు.

మరోవైపు అమెరికాలోని మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకుగానూ ఇప్పటి వరకు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 290 , రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ 232 ఓట్లను కైవసం చేసుకున్నారు. 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న జార్జియాలో కౌంటింగ్‌ తేలలేదు. ఇప్పటికే 99 శాతం కౌంటింగ్‌ పూర్తి కాగా..బైడెన్‌ 15,000 పైచిలుకు ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. బైడెన్‌ అధ్యక్షపదవికి అవసరమైన 270 ఓట్లు సాధించడంతో ఒకవేళ జార్జియాలో ట్రంప్‌ విజయం సాధించినా పెద్దగా మార్పులేమీ ఉండబోవు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి ఏమైనా అనుమానాలుంటే డిసెంబరు 8లోగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 14న విజేతను అధికారికంగా ప్రకటిస్తారు. అయితే, అమెరికాలో ఒక రకంగా ఎన్నికల సమరం ముగిసిపోయినట్లేనని ఓబ్రియాన్‌ అన్నారు. గతంలోనూ శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడి జరిగినట్లు ఆయన గుర్తు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని