సూడాన్‌లో వర్గ పోరు..60 మంది మృతి!

సూడాన్డాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో 60 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. పశ్చిమ డార్ఫర్‌ ప్రావిన్సులోని......

Published : 27 Jul 2020 09:33 IST

డార్ఫర్(సూడాన్‌)‌: సూడాన్లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో 60 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. పశ్చిమ డార్ఫర్‌ ప్రావిన్సులోని మస్తేరీ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 

సూడాన్లోని ‘యూఎన్‌ ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్ ఆఫ్‌ హుమానిటేరియన్‌ అఫైర్స్‌‌’ (ఓసీహెచ్‌ఏ) వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 500 మంది సాయుధులు మస్తేరీ గ్రామంపై దాడికి దిగారు. మసలిట్‌, ఇతర అరబ్‌ తెగల మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఘర్షణలు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. 60 మంది తీవ్రంగా గాయపడడంతో వారందరినీ హెలికాప్టర్‌లో జెనేనా పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో దుండగులు అనేక ఇళ్లను దోచుకున్నారు. అనంతరం వాటికి నిప్పంటించారు. దాడి తరువాత రక్షణ కల్పించాలని కోరుతూ స్థానికులు నిరసన చేపట్టారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేది లేదని స్థానిక నాయకుల నివాసాల ముందు బైఠాయించారు. 

నియంత పాలకుడు సుల్తాన్‌ అల్‌-బషిర్‌ను మిలిటరీ తిరుగుబాటుతో గద్దె దింపిన తర్వాత సూడాన్ ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అక్కడ మిలిటరీ ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓసీహెచ్‌ఏ అనేక పునరావాస కార్యక్రమాలు చేపట్టింది. తాజా అల్లర్లతో ఆ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని