సెప్టెంబరు నాటికి కరోనాకు చికిత్స!

కొవిడ్‌ చికిత్స కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీపి కబురు చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా కరోనా వైరస్‌ చికిత్స అందుబాటులోకి వచ్చే.......

Published : 18 Jul 2020 00:05 IST

ఆంటోనీ ఫౌచీ అంచనా

వాషింగ్టన్‌: కొవిడ్‌ చికిత్స కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీపి కబురు చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా కరోనా వైరస్‌ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ’లతో చేస్తున్న క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్‌తో గురువారం జరిపిన సంభాషణలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 

మోనోక్లోనల్‌ యాంటీబాడీ అనేది ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్‌. అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందజేసేందుకు, ఆరోగ్యంగా ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వీటిని ఉపయోగిస్తారు.  అంటువ్యాధుల నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ కరోనా చికిత్సకు వీటిని ‘కచ్చితమైన తూటాలు’గా అభివర్ణించారు.  వైరస్‌ బారిన పడ్డవారిలో ఏర్పడ్డ యాంటీబాడీల నుంచి వీటిని అభివృద్ధి చేస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ తరుణంలో వైరస్‌ తీవ్రతను తగ్గించే ఔషధాల అవసరం చాలా ఉందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో తప్పనిసరిగా చేరాల్సిన ముప్పు నుంచి తప్పించే చికిత్స అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. లేదా లక్షణాల తీవ్రతనైనా తగ్గించే మందులు ఉండాలని అభిప్రాయపడ్డారు. 

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో మరోసారి యావత్తు దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్‌ కట్టడికి సమయం కేటాయించాలని హితవు పలికారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలన్న ఆలోచనలో వైరస్‌ను కట్టడి చేసే మార్గదర్శకాలను విస్మరించారని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొన్ని రోజులుగా యువతలో పెరుగుతున్న వైరస్‌ కేసులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని