
‘అరబ్ ప్రపంచం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది’
కువైట్ రాజు మృతి పట్ల మోదీ సంతాపం
దిల్లీ: కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. షేక్ సబాతో భారత్‌కు మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు కువైట్‌తో పాటు అరబ్ ప్రపంచం గొప్ప నాయకుడిని కోల్పోయింది. షేక్ సబా గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌కు మంచి మిత్రుడు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కువైట్‌లోని భారతీయుల సంరక్షణ కోసం ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కువైట్ రాజు మృతి చెందడం ఎంతో బాధాకరం. ఆయన కుటుంబానికి, కువైట్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. కువైట్ రాజు షేక్ సబా (91) అమెరికాలోని రోచెస్టర్‌లో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. రాజు మరణంతో కువైట్‌లో సంతాప దినం ప్రకటించారు.