మొదట పాకిస్థాన్‌..ఇప్పుడు చైనా..!

భారత్‌కు ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పందించారు.

Published : 13 Oct 2020 01:34 IST

సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయన్న రక్షణ మంత్రి
44వంతెనలను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: భారత్‌కు ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పందించారు. మొదట పాకిస్థాన్‌, ఇప్పడు చైనా దేశాలు సరిహద్దులో వివాదం సృష్టిస్తున్నాయని స్పష్టంచేశారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే.. ఒక మిషన్‌లో భాగంగానే ఈ రెండు దేశాలు వివాదం సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలను ప్రారంభించిన అనంతరం రక్షణశాఖ మంత్రి ఈ విధంగా స్పందించారు.

లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని‌ సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 44 వంతెనలను రాజ్‌నాథ్ సింగ్‌ నేడు ప్రారంభించారు. అనంతరం రెండు దేశాల సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై సైనిక అధికారులతో సమీక్షించారు. ‘మొదట్లో పాకిస్థాన్‌, ఇప్పుడు చైనా దేశాలు ఒక మిషన్‌లో భాగంగా ఈ వివాదాలు సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాలతో భారత్‌కు దాదాపు 7వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పటికీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి’ అని రక్షణ మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలాంటి సంక్షోభాలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రాంతాల్లో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిర్మాణ పనుల్లో అవిశ్రాంతంగా పనిచేసిన బోర్డర్ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(BRO)ను రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గత రెండేళ్లలోనే కొండప్రాంతాల్లో దాదాపు 2200కిలోమీటర్లకు పైగా రహదారులను బీఆర్‌ఓ నిర్మించిందని రక్షణమంత్రి పేర్కొన్నారు. వీటితోపాటు మరో 4200కి.మీ ఉపరితల రోడ్డు మార్గాలను బీఆర్‌ఓ నిర్మిస్తోన్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే, భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలోనే ఈ వంతెనలు పూర్తికావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణమున్న లద్దాఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లోనే దాదాపు 7వంతెనలు ఉన్నాయి. వీటి ద్వారా స్థానికులకే కాకుండా సంవత్సరం పాటు భారత సైన్యం తేలికగా ఆయుధ సామాగ్రిని తరలించేందుకు వీలుంటుంది. వీటితోపాటు మంచుకొండలతో నిండివుండే హిమాచల్‌ ప్రదేశ్‌లోని డార్చా ప్రాంతాన్ని లద్దాఖ్‌తో అనుసంధానించే ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని