వైమానిక దళంలో చేరిన రఫేల్ జెట్స్‌

భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో.. రఫేల్ యుద్ధవిమానాల చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది.

Updated : 10 Sep 2020 14:17 IST

దిల్లీ: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో..రఫేల్ యుద్ధవిమానాల చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్‌ మంత్రి ఫ్లొరెన్స్‌ పార్లె నేతృత్వంలో మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు రఫేల్ యుద్ధ విమానాలను అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. హరియాణలోని అంబాలా వైమానిక స్థావరం ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లొరెన్స్ పార్లె, సీడీఎస్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన యుద్ధవిమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రముఖులంతా ముఖానికి మాస్కులు ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు.

 

నాలుగు సంవత్సరాల క్రితం భారత్‌, ఫ్రాన్స్‌కు మధ్య 36 రఫేల్ విమానాల కోసం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం విలువ రూ.59,000 కోట్లు. ఆ విమానాల తయారీ బాధ్యతను ఆ దేశానికి చెందిన ఏరోస్పేస్‌ సంస్థ దసో ఏవియేషన్‌ తీసుకుంది. దానిలో భాగంగా మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు విమానాలు జులై 29న అంబాలాకు చేరుకున్నాయి.


17వ స్క్వాడ్రన్ గోల్డెన్‌ ఆరోస్లోకి రఫేల్..

తాజాగా మొదటి బ్యాచ్‌కు చెందిన 5 యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్ గోల్డెన్‌ ఆరోస్‌ ద్వారా సేవలు అందించనున్నాయి. భారత వాయు సేనలో గోల్డెన్‌ ఆరోస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత కఠిన ఆపరేషన్లకు మొత్తం ఈ స్వాడ్రనే బాధ్యత వహిస్తుంది. 17వ స్క్వాడ్రన్‌కు స్థావరమైన అంబాలా దేశ సైనిక చరిత్రలో ఒక కీలక భాగం. పాకిస్థాన్‌తో తొలి యుద్ధం నుంచి గతేడాది బాలాకోట్ దాడిలో కూడా దీనిదే కీలక పాత్ర.  అందుకే 17వ స్క్వాడ్రన్‌కు తొలి బ్యాచ్‌ రఫేల్‌ను అప్పగిస్తున్నారు. కాగా..జైషే మహ్మద్ శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసిన క్రమంలో రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘రఫేల్ యుద్ధ విమానాలు ఇంతకంటే గొప్ప ఫలితాలు ఇవ్వగలవు’ అని అప్పట్లో వ్యాఖ్యానించారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని