కరోనాలోనూ రైలు కూత ఆగలేదు..

కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన......

Published : 26 Dec 2020 18:42 IST

రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడి

దిల్లీ: కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని రైల్వేబోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్‌ ప్రణాళికలను మీడియాకు వెల్లడించారు. 2020లో తొలిసారి కిసాన్‌ ప్రత్యేక రైళ్లు నడపడం ఈ ఏడాది రైల్వేశాఖ ప్రత్యేకత అని వీకే యాదవ్‌ వెల్లడించారు. మొదటి కిసాన్‌ రైలు మహారాష్ట్ర నుంచి దేవ్‌లాలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు నడిపామని, డిమాండ్‌ దృష్ట్యా దాన్ని ముజఫర్‌పూర్‌ వరకు పొడిగించామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 రూట్లలో కిసాన్‌ రైళ్లు నడుపుతున్నామని వివరించారు. ఇప్పటి వరకు 27వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగిందని తెలిపారు. ఈ రైళ్ల వల్ల రైతుల పంటలకు మంచి మార్కెట్‌ వచ్చిందని చెప్పారు.

ప్రమాదాల నివారణకు అన్ని రైళ్లలో బోగీలను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వీకే యాదవ్‌ వివరించారు. ఈ కోచ్‌ల నిర్మాణంలో ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 120 కిలోమీటర్లు.. 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ప్యాసింజర్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లు మేకిన్‌ ఇండియాలో భాగంగా తయారవుతున్నాయని చెప్పారు. 2022 డిసెంబర్‌ నాటికి తొలి లోకోమోటివ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఛార్‌ధామ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌
ఛార్‌ధామ్‌ యాత్రికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నాలుగు  క్షేత్రాలను కలుపుతూ నిర్మించే ఈ రైల్వే లైను నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైందని తెలిపింది. అలాగే, 2024 డిసెంబర్‌ నాటికి 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైలు లింక్ పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు రామేశ్వరం ఆధునిక పంబన్‌ వంతెన 2021 అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని చెప్పారు.

ఒకేసారి ‘బుల్లెట్‌’
బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు 1396 హెక్టర్లలో 949 హెక్టార్ల భూమిని రైల్వే శాఖ సేకరించామని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. గుజరాత్‌లో 90 శాతం వరకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అక్కడ దశలవారీగా భూ సేకరణ జరుగుతుందన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ మొత్తం ఒకేసారి ప్రారంభించడానికి రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు. మొదటి దశ బుల్లెట్ రైలును 325 కిలోమీటర్ల నిడివిలో నడుపుతామని వివరించారు.

అదో గొప్ప విజయం
కరోనా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, బొగ్గు, ఎరువులు, ఔషధాలు సహా అవసరమైన అన్ని వస్తువులను చేరవేయడం రైల్వే శాఖ సాధించిన అతిపెద్ద ఘనత అని వీకే యాదవ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కార్మిక ప్రత్యేక రైళ్లను నడపడం కూడా ఒక పెద్ద విజయమేనని చెప్పారు. భద్రతను పెంచుతూ డిమాండ్‌ ప్రకారం ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లను నడపడమే లక్ష్యమని కొత్త సంవత్సరం ప్రాధాన్యాలను రైల్వే బోర్డు ఛైర్మన్‌ వివరించారు.

ఇవీ చదవండి..
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: మోదీ
పూజాదేవి.. తొలి మహిళా బస్సు డ్రైవర్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని