
తమ్ముడు చెప్పిందే చేస్తాడు: రజనీ సోదరుడు
బెంగళూరు: కొత్త పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నట్టు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేయడంపై ఆయన సోదరుడు సత్యనారాయణరావు స్పందించారు. అనారోగ్య కారణాలతో పార్టీ ఆలోచనను ఉపసంహరించుకోవడాన్ని సమర్థించారు. పార్టీ ఏర్పాటు రజనీ ఇష్టమని, తన ఆలోచన మార్చుకోవాలని ఎవరూ బలవంతం చేయలేరన్నారు. పార్టీపై ప్రజల్లో అనేక అంచనాలు ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు 77 ఏళ్ల సత్యనారాయణరావు స్పందిస్తూ.. తాము కూడా పార్టీ ప్రారంభిస్తారనే అనుకున్నామన్నారు. కానీ అనారోగ్య కారణాలను చెప్పడం వల్ల తాము ఈ విషయంలో బలవంతం చేయలేమని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు చేయకపోవడమనేది రజనీ ఇష్టమేనన్నారు. సూపర్‌స్టార్ ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా సరైందేనని అభిప్రాయపడ్డారు. అనారోగ్యానికి గురైన తన సోదరుడితో సోమవారమే మాట్లాడినట్టు సత్యనారాయణరావు చెప్పారు. రజనీకాంత్ మాటమీద నిలబడే వ్యక్తి అన్నారు. ఏం చెబుతాడో కచ్చితంగా అదే చేస్తాడని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారన్నారు.
రాజకీయ ప్రవేశంపై వెనక్కి తగ్గుతున్నట్టు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల నేపథ్యంలో తన పార్టీ ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఆయన స్పష్టంచేశారు. అనారోగ్యం బారిన పడటాన్ని దేవుడి హెచ్చరికగా భావిస్తున్నానన్న రజనీ.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త పార్టీ సాధ్యం కాదన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనని స్పష్టంచేశారు. ఈ నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టొచ్చని, తాను ఎంతో బాధతోనే ఈ ప్రకటన చేస్తున్నట్టు సూపర్ స్టార్ తెలిపారు.
ఇవీ చదవండి..
రజనీ వెనక్కి.. మరి విజయ్ ఎంట్రీ?