రైతుల్లో గందరగోళానికి యత్నించారు:రాజ్‌నాథ్‌

పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ మంత్రి విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులపై రైతుల్లో గందరగోళం సృష్టించి వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని అన్నారు.

Published : 21 Sep 2020 01:01 IST

దిల్లీ: పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులపై రైతుల్లో గందరగోళం సృష్టించి వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని ఆరోపించారు. ఈమేరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.  

'ప్రభుత్వం రైతులను బాధపెడుతుందంటే ఎప్పటికీ నమ్మకూడదు. నేను కూడా రైతునే. దేశంలోని రైతులందరికీ నేను హామీ ఇస్తున్నాను. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలకు ముగింపు పలికే ఉద్దేశం లేదు. హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై నేను వ్యాఖ్యానించను. ఎందుకంటే ప్రతి నిర్ణయం వెనుక కొన్ని రాజకీయ కారణాలుంటాయి. ఏదైనా అంశంపై సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం అధికారపార్టీ బాధ్యత. దాన్ని ప్రతిపక్షాలు గౌరవించాలి. కానీ రాజ్యసభలో ఈరోజు కొందరు సభ్యులు డిప్యూటీ ఛైర్మన్‌ పట్ల వ్యవహరించిన తీరు చాలా తీవ్రమైనది. అది పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు జరగలేదు'అని రాజ్‌నాథ్‌ అన్నారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌పై ప్రతిపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ.. 'ఛైర్మన్‌కు నోటీసులు అందాయి. నిర్ణయం ఆయనే తీసుకుంటారు. అది ఆయన హక్కు. రాజకీయంగా నేను ఏం వెల్లడించను' అని చెప్పారు. విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ ఆదివారం రాజ్యసభలో రెండు వ్యవసాయ సంబంధిత బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకోవడంలో డిప్యూటీ ఛైర్మన్‌ సహకరించారని ఆరోపిస్తూ 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని