ఆ నిర్ణయం ఎవరి విజయమూ కాదు: రౌత్‌

మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాల పునఃప్రారంభం నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్పందించారు. ఆ నిర్ణయం ఎవరికీ విజయమూ కాదు.. ఓటమీ కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Updated : 16 Nov 2020 01:30 IST

ముంబయి: మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాల పునఃప్రారంభం నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్పందించారు. ఆ నిర్ణయం ఎవరికీ విజయమూ కాదు.. ఓటమీ కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ప్రభుత్వం ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌) మార్గదర్శకాల ప్రకారమే ప్రార్థనా మందిరాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని తప్పక పాటించాలి. అందులో ఎవరూ లబ్ది పొందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తూ ప్రార్థనా మందిరాలు తెరుచుకునే సమయం వచ్చింది. అంతేకానీ ఈ నిర్ణయం ఎవరికీ విజయం కాదు. ఎవరికీ ఓటమి కూడా కాదు’ అని రౌత్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివారం రౌత్‌ 60వ జన్మదినం కావడంతో తన అనుభవాల గురించి ప్రశ్నించగా.. ‘‘శివసేన పార్టీ అధికార పత్రిక అయిన ‘సామ్నా’లోనే నా జీవితం ఎక్కువగా గడిచింది. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుంది’’ అన్నారు. 

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి నుంచి రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో వాటి పునఃప్రారంభానికి సంబంధించిన విషయమై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ఠాక్రే మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలను ఈ నెల 16వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ఠాక్రే శనివారం ప్రకటించించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని