రూ.499కే కరోనా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు..!

కొవిడ్‌-19 నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే మొబైల్‌ ల్యాబోరేటరీలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సోమవారం ప్రారంభించారు. దిల్లీలోని ఐసీఎంఆర్‌ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ మొబైల్‌ ప్రయోగశాలల్ని ప్రారంభించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 23 Nov 2020 21:25 IST

దిల్లీ: కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే మొబైల్‌ ప్రయోగశాలలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సోమవారం ప్రారంభించారు. దిల్లీలోని ఐసీఎంఆర్‌ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ మొబైల్‌ ప్రయోగశాలల్ని ప్రారంభించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఈ ల్యాబ్‌ల ద్వారా కేవలం రూ.499కే అతితక్కువ ఖర్చుతో ఆర్టీపీసీఆర్‌ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల ఫలితాలు కూడా ఆరు గంటల్లోనే తెలుసుకోవచ్చు. దిల్లీలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం, స్పైస్‌ హెల్త్‌ సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ ల్యాబ్‌లకు శ్రీకారం చుట్టింది.  మొదటి దశలో భాగంగా దిల్లీలో 20 ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నాం. ఒక్కోటి రోజుకు 1000 టెస్టులు చేస్తుంది. దేశ రాజధానిలో అవసరాన్ని బట్టి ఈ మొబైల్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని ఆయా ప్రాంతాల్లో ఉపయోగిస్తాం ’ అని ఐసీఎంఆర్‌ అధికారులు వెల్లడించారు. 

దేశరాజధానిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో నవంబర్‌ 16న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దిల్లీలో కేంద్రం సహకారంతో ఆరోగ్య సదుపాయాలను మెరుగు పరుస్తూ చర్యలు తీసుకుంటున్నారు. దిల్లీలో ఆదివారం 6వేల కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 121 మంది కరోనా కారణంగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్పైస్‌ హెల్త్‌, జెని స్టోర్‌, జనోమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ పరీక్షల సదుపాయాల్ని దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. ఈ టెస్టింగ్‌ కిట్స్‌, ల్యాబ్‌ సదుపాయాలకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని