చైనా గురించి అలా చెప్పడం ఊహాజనితమే

కరోనావైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదని మేం చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది.

Updated : 28 Nov 2020 16:07 IST

కరోనా వైరస్ పుట్టినిల్లు వాదనపై ఆరోగ్య సంస్థ స్పందన

జెనీవా: కరోనావైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదని మేము చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని ఆహార మార్కెట్‌లో మొదట ఈ మహమ్మారిని గుర్తించిన సంగతి తెలిసిందే. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఈ కమ్యూనిస్టు దేశంపై విమర్శలు చేస్తున్నాయి. దాంతో ఆరోగ్య సంస్థ చైనాకు వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనున్న నేపథ్యంలో..ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తోంది. తొలుత ఈ వైరస్ వుహాన్ నగరంలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడే పుట్టిందని చెప్పలేమని అంటోంది. భారత్ నుంచి చేపలు సహా, వివిధ దేశాల నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకున్నామని, వాటిలో కరోనా లక్షణాలు కనిపించాయని ఆ దేశ అధికారులు వింత వాదన వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో జెనీవాలో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ విభాగం‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైక్ ర్యాన్ మాట్లాడారు. కరోనా వైరస్ మొదట చైనా వెలుపల ఉద్భవించిందా? అంటూ ఈ సమావేశంలో మైక్‌ ర్యాన్‌ను ప్రశ్నించగా..‘ఈ వ్యాధి చైనాలో ఉద్భవించలేదని మేం చెప్పడం అత్యంత ఊహాజనితమని భావిస్తున్నాం’ అని సమాధానం ఇచ్చారు. అయితే,  ‘ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుల్లో మొదట వైరస్ బయటపడిన ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించాలి. ఆ పరిశోధన ఇతర ప్రాంతాలకూ విస్తరించొచ్చు’ అని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని