ఇండియన్‌-అమెరికన్‌లే లక్ష్యంగా ట్రంప్‌ ప్రచారం..!

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘4 మోర్‌ ఇయర్స్‌’ అంటూ ఇండియన్ అమెరికన్‌ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తొలి ప్రచార వీడియోను విడుదల చేసింది.

Published : 24 Aug 2020 00:29 IST

ప్రచార వీడియోను విడుదల చేసిన ట్రంప్‌ బృందం

వాషింగ్టన్‌: అమెరికాలో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోడ్‌షోలతో దూసుకెళ్తుండగా, ప్రత్యర్థి జోబైడెన్‌ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అ‌మెరికన్ల కీలక పాత్ర పోషిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ అమెరికన్‌లే లక్ష్యంగా జరిపే ప్రచారాన్ని ట్రంప్‌ ప్రచార బృందం ప్రారంభించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ‘4 మోర్‌ ఇయర్స్‌’ అంటూ ఇండియన్ అమెరికన్‌ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తొలి ప్రచార వీడియోను విడుదల చేసింది.

అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించిన సమయంలో ప్రసంగంతోపాటు నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో చేసిన ప్రసంగాన్ని జతకలిపి రూపొందించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. దీన్ని ట్రంప్‌ విక్టరీ ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్‌, ట్రంప్‌ బృందం సలహాదారు కింబర్లీ గుల్‌ఫోయేల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘భారత్‌తో ఉన్న గొప్ప అనుబంధాన్ని అమెరికా ఆస్వాదిస్తోంది. ఇండియన్ అమెరికన్ల నుంచి వస్తోన్న మద్దతుతో మా ఎన్నికల ప్రచార బృందం మరింత ఉత్సాహంతో ముందుకెళ్తోంది’ అని కింబర్లీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో అమెరికాలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హ్యూస్టన్‌ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అక్కడున్న భారతీయులు, మోదీ మద్దతుదారులు హాజరయ్యారు. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ట్రంప్‌ ప్రసంగించారు. ఈ రెండు సందర్భాల్లోని ప్రసంగాలను కలిపి ట్రంప్‌ ఎన్నికల ప్రచారబృందం ఈ వీడియోను రూపొందించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని