Space: రోదసిలో మీకు మేము.. మాకు మీరు

రోదసి రంగంలో ఐరోపా, ఇజ్రాయెల్‌తో మరింత సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అక్కడి అంతరిక్ష సంస్థలతో

Published : 02 Aug 2021 21:24 IST

ఐరోపా, ఇజ్రాయెల్‌ అంతరిక్ష సంస్థలతో ఇస్రో చర్చలు

బెంగళూరు: రోదసి రంగంలో ఐరోపా, ఇజ్రాయెల్‌తో మరింత సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అక్కడి అంతరిక్ష సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఉమ్మడిగా సాగేందుకున్న అవకాశాలను శోధిస్తోంది. ఈ దిశగా ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌.. ఇజ్రాయెల్‌ రోదసి సంస్థ (ఐఎస్‌ఏ) అధిపతి అవి బ్లాస్‌బెర్గర్, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) డైరెక్టర్‌ జనరల్‌ జోసెఫ్‌ ఆష్‌బాచెర్‌తో వర్చువల్‌ సమావేశాలు నిర్వహించారు. చిన్నపాటి ఉపగ్రహాల కోసం విద్యుత్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ అభివృద్ధి, భూ అనువర్తిత కక్ష్య (జియో), దిగువ భూ కక్ష్య (లియో) మధ్య ఆప్టికల్‌ లింక్‌ ప్రాజెక్టుల విషయంలో ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న సహకారాన్ని బ్లాస్‌బెర్గర్‌తో శివన్‌ సమీక్షించారు. భారత రాకెట్‌ సాయంతో ఇజ్రాయెల్‌ ఉపగ్రహాలను ప్రయోగించే అంశంపై చర్చించారు.

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవంతోపాటు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2022లో ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించే అంశంపైనా చర్చించారు. భూ పరిశీలన, అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ నేవిగేషన్, రోదసి స్థితిగతులపై అవగాహన, మానవసహిత అంతరిక్ష యాత్రలు వంటి రంగాల్లో ఐరోపాతో కొనసాగుతున్న సహకారంపై ఆష్‌బాచెర్‌తో సమీక్షించారు. రెండు సంస్థల మధ్య సహకారాన్ని మరింత మెరుగుపరచుకునేలా అవకాశాలను గుర్తించేందుకు కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇస్రోతో సహకారానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆష్‌బాచెర్‌ ట్వీట్‌ చేశారు. అంతరిక్ష యాత్రల సమయంలో భూ కేంద్రాల సేవలను పరస్పరం ఉపయోగించుకోవాలని ఇస్రో-ఈఎస్‌ఏలు ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని