ఓడిపోయినా అలా అధికారమివ్వను: ట్రంప్‌

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య విమర్శల పరంపర కొనసాగుతోంది. అయితే తాజాగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఒక వేళ అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైనా..ప్రశాంత....

Updated : 24 Sep 2020 13:53 IST

న్యూయార్క్‌: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైనా..ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడిని తాను ఒప్పుకోనని ట్రంప్‌ వెల్లడించారు. తన ఓటమికి అమెరికా పౌరుల వ్యతిరేక ఓటింగ్‌ కారణం కాదని, మెయిల్‌ ఓటింగ్‌ వల్లే తాను ఓడిపోయినట్లు భావిస్తానని ట్రంప్‌ వెల్లడించారు. కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే డెమోక్రటిక్‌ పార్టీ మెయిల్‌ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘ ఏం జరుగుతుందో చూద్దాం. మెయిల్‌ ఓటింగ్‌ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మీ అందరికీ తెలుసు’’ అని అన్నారు. అది సరే..ఒక వేళ మీరు ఓడిపోతే ప్రశాంత వాతావరణంలో అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధమేనా?అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘ముందు మెయిల్‌ బ్యాలెట్లను వదిలించుకుందాం. అప్పుడు మేము, మీరు అందరూ ప్రశాంతంగా ఉంటారు. అదే జరిగితే అధికారం మార్చాల్సిన పని కూడా ఉండదు. కొనసాగింపే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. మెయిల్‌ బ్యాలెట్ల పరిస్థితి అదుపు తప్పిపోతోందని, దానికి కారణం ఎవరో మీ అందరికీ తెలుసని పరోక్షంగా డెమోక్రటిక్‌ పార్టీని విమర్శించారు.

గత కొన్ని నెలలుగా మెయిల్ ఓటింగ్‌పై ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. అమెరికా మిలిటరీ సిబ్బందితో సహా పలువురు ఏ సమస్యలు లేకుండా తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు చాలా కాలంగా మెయిల్‌ ఓటింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాగా, ఈ విధానంలో భారీ స్థాయి ఎన్నికల మోసాలు, అక్రమాలు జరిగే అవకాశముందని అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ఆరోపిస్తున్నారు. మరోవైపు మెయిల్‌ ఓటింగ్‌ ద్వారా మోసం జరుగుతోందని ఇప్పటి వరకు నిరూపణ కాకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని