శ్వేతసౌధం వీడాలంటే.. ట్రంప్‌ షరతు ఇదేనట!

మంకుపట్టు పట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కాస్త మెత్తబడ్డారు.

Updated : 28 Nov 2020 12:00 IST

వాషింగ్టన్‌: తన ప్రత్యర్థి జో బైడెన్‌ విజయాన్ని ససేమిరా అంగీకరించనంటూ మంకుపట్టు పట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కాస్త మెత్తబడ్డారు. అధికార నివాసం వైట్‌ హౌస్‌ను వదిలి వెళ్లేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అయితే అందుకు ఓ షరతు ఉందంటూ మెలిక పెట్టారు. బైడెన్‌ గెలిచినట్టు అధికారికంగా నిర్ధారణ అయితే అందుకు సిద్ధమని ప్రకటించారు.

గ్రరాజ్యం రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా.. ఎన్నికల ఫలితాలను అంగీకరించనంటూ ట్రంప్ మొండికేసిన సంగతి తెలిసిందే. తన వాదనకు సమర్థింపుగా బ్యాలెట్లు ఎత్తుకెళ్లారని, ఓటింగ్‌ యంత్రాలు లక్షలాది ఓట్లను మాయం చేశాయని, పోస్టల్‌ ఓట్లు చెల్లవంటూ వింత కారణాలతో.. ఆధారంలేని కేసులతో న్యాయస్థానం తలుపుతట్టారు. అయితే వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కాస్త మెత్తబడినట్టే కనబడుతోంది. ఎలక్టోరల్ కాలేజీ గనక బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరిస్తే.. శ్వేతసౌధాన్ని వదిలేందుకు సిద్ధమేనా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘తప్పకుండా అలాగే చేస్తాను.. ఆ సంగతి మీకు తెలుసు కదా’’ అంటూ ట్రంప్‌ సమాధానమిచ్చారు. నవంబర్‌ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 306, ట్రంప్‌ 232 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనే విషయాన్ని ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ బృందం అధికారికంగా నిర్ణయిస్తుంది. కాగా ఇది డిసెంబర్‌ 14న సమావేశం కానుంది.

అయితే,  చట్టసభ సభ్యులు బైడెన్‌ విజయాన్ని ఆమోదిస్తే వారు పెద్ద తప్పు చేసినట్టే అవుతుందని ట్రంప్‌ అన్నారు. ఓటమిని ఒప్పుకోవటం చాలా కష్టంగా ఉందంటూ వాపోయారు. పూర్తిగా ఆశ వీడని ట్రంప్‌.. ప్రమాణ స్వీకారం చేయాల్సిన జనవరి 20కి మధ్య ఎన్నో సంఘటనలు జరగొచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అసలీ ఎన్నికలే పెద్ద మోసమని, ఇక్కడ నూటికి నూరుపాళ్లు రిగ్గింగ్‌ జరిగిందంటూ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల విధానం వెనుకబడిన దేశాల్లో మాదిరిగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని