
2016 కంటే భారీ మెజార్టీ ఖాయం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో మరో రెండు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇద్దరూ తమ ప్రచారానికి మరింత పదునుపెట్టారు. నవంబరు 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో కచ్చితంగా రిపబ్లికన్లే విజయం సాధిస్తారని ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 2016 కంటే భారీ మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. కీలక రాష్ట్రంగా భావిస్తున్న పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన నాలుగు ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. గత నాలుగు సంవత్సరాల్లో తన నాయకత్వంలోని పాలక వర్గం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు.
తన ప్రత్యర్థి జో బైడెన్ అవినీతిపరుడంటూ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ గెలిస్తే దేశంలో సామ్యవాదం రాజ్యమేలుతుందని.. పన్నులు విపరీతంగా పెరిగిపోతాయని ఆరోపించారు. తనకు దేశవ్యాప్తంగా మద్దతు పవనాలు వీస్తున్నాయని.. డెమొక్రాట్లు ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలోనైతే రాజ్యాంగానికి తుది ఆమోదం లభించిందో.. అదే రాష్ట్ర ప్రజలు నవంబరు 3న అమెరికా కలని సాకారం చేయబోతున్నారంటూ పరోక్షంగా పెన్సిల్వేనియా రాష్ట్ర ఓటర్లను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. గత నాలుగేళ్లలో సైనికపరంగా, రక్షణపరంగా అమెరికాను ఎంతో బలోపేతం చేశామన్నారు. మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేశామన్నారు. బైడెన్ ప్రణాళికలు అమెరికాను నాశనం చేస్తాయన్నారు. అదే తన విధానాలు అమెరికాను తిరిగి గొప్ప దేశంగా నిలబెడతాయని వ్యాఖ్యానించారు.
ట్రంప్‌ను పంపించేసే సమయం ఆసన్నమైంది..
మరోవైపు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తన ప్రత్యర్థి ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అమెరికాను ట్రంప్ ఓడించారన్నారు. అతణ్ని అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని ప్రజల్ని కోరారు. దేశాన్ని విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. డెట్రాయిట్, మిషిగన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
శ్వేతసౌధం నుంచి ట్రంప్ తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్ అన్నారు. తన ట్వీట్లు, బాధ్యతారాహిత్యం, ఆగ్రహం, ద్వేషం, వైఫల్యంతో అమెరికా ప్రజల్ని గందరగోళానికి గురిచేసిన ట్రంప్‌ను ఓటర్లు ఓడిస్తారని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో ట్రంప్ కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైనికుల తలలపై పుతిన్ బహుమతులు ప్రకటిస్తుంటే అధ్యక్షుడు ఏమీ చేయలేకపోతున్నారన్నారు. వాతావరణ మార్పులపై ట్రంప్ విధానాలు ఆగమ్యగోచరంగా మారాయని.. వాటిని వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement