
రెండోసారి.. అందుకోసమే ట్రంప్ ఆరాటం..!
విమర్శలు గుప్పించిన బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలోనూ ట్రంప్‌కు సరైన ప్రణాళిక లేదని విరుచుకుపడ్డారు. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తరపున ఒబామా ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుత అధ్యక్షుడికి సామాన్య అమెరికన్లపై ఎలాంటి సానుభూతి, ఆందోళన లేదని.. కేవలం ఆయన వ్యక్తిగత స్వార్థం, అతని సంపన్న మిత్రుల కోసమే రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శించారు. అతని చుట్టూ ఉండే వారు లాబీ చేసేవారని..సామాన్యులెవ్వరూ ట్రంప్‌కు దగ్గరలో ఉండరని అన్నారు. డెమోక్రాట్ అభ్యర్థులు బైడెన్, కమలా హారిస్‌లు మాత్రం మీకోసం, మనందరి కోసం పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అందుకే వీరికి మద్దతు తెలపాలని అమెరికన్ ఓటర్లకు బరాక్ ఒబామా విజ్ఞప్తి చేశారు.
గతంలో తమ ప్రభుత్వ అవలంభించిన విధానాలను కూడా ట్రంప్ అమలు చేయరనే విషయం తనకు తెలుసని ఒబామా అభిప్రాయపడ్డారు. సవాళ్లను, కఠిన ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ట్రంప్‌కు లేదని స్పష్టం చేసిన ఒబామా, తాజాగా ఓ ఇంటర్వ్యూ నుంచి ట్రంప్ వెళ్లిపోయిన సన్నివేశాన్ని ప్రస్తావించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో స్పష్టమైన ప్రణాళిక లేనందునే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడా, మియామీ ప్రాంతాల్లో డెమోక్రాట్ అభ్యర్థుల తరపున ఒబామా ప్రచారం నిర్వహించారు.
Advertisement