
పట్టు వదలని ట్రంప్..
మనం గెలుస్తామంటూ మరోసారి ప్రకటన
ఇంటర్నెట్ డెస్క్: హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని చవిచూశారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 సీట్లను మాత్రమే సొంతం చేసుకున్నారు. ఓటమి కంటే గెలుపే సులభమని.. జో బైడెన్ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు కష్టసాధ్యమని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకుండానే గెలిచానంటూ ప్రకటించిన ఆయన.. అనంతరం కూడా అపజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఇచ్చే స్పీచ్ ఊసే ఎత్తడం లేదు. పైగా తానే ఎన్నికల్లో గెలిచానని ఈ ఆదివారం ప్రకటించిన ట్రంప్.. అదే వైఖరి కొనసాగించి మళ్లీ మంగళవారం కూడా ‘‘మనం గెలుస్తాం!’’ అంటూ వెల్లడించారు.
సాధారణ ప్రజలు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే ట్విటర్ దానిని తొలగిస్తుంది. ఐతే దేశాధ్యక్షుడి స్థాయి వార్తలకు ఈ నిబంధన వర్తించకపోవటాన్ని ట్రంప్ వినియోగించుకుంటున్నారు. తానే గెలిచానని, ఎన్నికల విజయాలను డెమొక్రాటిక్ పార్టీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందంటూ నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ చేసేదేంలేక ఆయన సందేశాల్లో కొన్నిటిపై అవాస్తవ సమాచారం అని తెలిపే విధంగా ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక ఉంచుతోంది. అయితే ఈయన పదవీకాలం ముగిసిన అనంతరం.. ఈ సౌలభ్యాన్ని తొలగిస్తామని ట్విటర్ అధికారి ఒకరు గతంలో ప్రకటించారు.