అలా చేయకపోతే..చైనా నుంచి మరో మహమ్మారి

కరోనావైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తును చైనా అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది.

Published : 20 Dec 2020 02:27 IST

అమెరికా తీవ్ర ఆరోపణలు

వాషింగ్టన్‌: కరోనావైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తును చైనా అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ వ్యాప్తి విషయంలో అంతర్జాతీయ సమాజం చైనాను జవాబుదారీ చేయాలని అమెరికా విదేశంగా మంత్రి మైక్ పాంపియో డిమాండ్‌ చేశారు. తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్లే ప్రపంచమంతా ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుందని అగ్రదేశం వీలుచిక్కినప్పుడల్లా చైనాపై మండిపడుతూనే ఉంది. ఆ వైరస్‌ను ‘చైనా వైరస్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. 

‘కరోనావైరస్ ప్రపంచాన్ని చట్టుముట్టి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తప్పుడు సమాచారాన్నే ప్రచారం చేస్తోంది. వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య సంస్థ చేస్తోన్న దర్యాప్తును అడ్డుకుంటోంది. చైనా తయారు చేసిన టీకాల విషయంలో పారదర్శకత కొరవడంతో పాటు, క్లినికల్ ట్రయల్స్‌ గురించి సమాచారం ఇవ్వకుండా..వాటిని ప్రజలకు అందజేస్తోంది. ఈ తీరు చైనా పౌరులను, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుంది’ అని పాంపియో చైనా వైఖరిని తప్పుపట్టారు.  10లక్షలకు పైగా మరణాలకు కారణమై, భారీ సంఖ్యలో ప్రజల జీవనోపాధిని దూరం చేసిన ఈ వైరస్‌పై చైనాను అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని ఆయన కోరారు. ఒకవేళ అలా చేయకపోతే, భవిష్యత్తులో మరో మహమ్మారికి ఈ దేశం కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చైనాలోని వుహాన్‌ నగరంలోని ఆహారపు మార్కెట్లో వైరస్ మొదట వెలుగుచూసిందని యావత్‌ ప్రపంచం భావిస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చే నెలలో చైనాలో పర్యటించనుంది. ఈ క్రమంలో వుహాన్ యంత్రాంగం స్పందించింది. తాము దర్యాప్తునకు భయపడటం లేదని, వైరస్ ఇక్కడ ఉద్భవించలేదనే విషయం తేటతెల్లమవుతుందని వెల్లడించింది. 

ఇదిలా ఉండగా..కరోనా వైరస్‌తో అగ్రదేశం అమెరికా అతలాకుతలం అవుతోంది. సమారు 1,74,42,100 మంది వైరస్ బారిన పడగా..3,13,000పైగా మరణాలు సంభవించాయి. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 7.6కోట్ల మందికి వైరస్ సోకింది. 16లక్షల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. 

ఇవీ చదవండి:

కొవిడ్-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!

మీరు మొసలిగా మారితే అది మీ సమస్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని