Published : 28/08/2020 01:10 IST

నీరు, నిప్పుతో అమెరికా అతలాకుతలం

అగ్రరాజ్యంపై ప్రకృతి కన్నెర్ర

ఇంటర్నెట్‌ డెస్క్: ఇప్పటికే కరోనా ప్రభావంతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాను వరుస ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియాలో వేగంగా వ్యాప్తిస్తున్న కార్చిచ్చుతో సతమతమైతున్న ఈ దేశంపై.. ఇప్పుడు పెనుతుపాను ‘లారా’ విరుచుకుపడనుంది.

గత కొద్ది రోజులుగా కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న కార్చిచ్చు 1.5 మిలియన్‌ ఎకరాలను దహించివేసింది. ఇప్పటివరకు సంభవించిన 7012 అగ్నిప్రమాద ఘటనలు ఇక్కడి నివాస స్థలాలను, అటవీ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆగస్టు నుంచి నవంబరు వరకు అగ్నిప్రమాద ఘటనలు సంభవించడం సర్వసాధారణమే. ‘డ్రై థండర్‌స్టార్మ్స్‌’గా పిలిచే వర్ష రహితమైన పొడి ఉరుముల కారణంగా అటవీ, నివాస ప్రాంతాల్లో మంటలు చెల రేగుతాయి. అయితే ఈ సారి వీటి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

కాలిఫోర్నియాలోనే అతి పెద్దదైన ఎల్‌ ఎన్‌ యూ కాంప్లెక్స్‌ కార్చిచ్చు.. సోమవారం నాటికి 3,50,00 ఎకరాల్లో వ్యాప్తించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాలిఫోర్నియాలో పార్కులు తదితర బహిరంగ ప్రదేశాలన్నింటినీ మంటలు, పొగ కారణంగా మూసివేశారు. ఈ మంటలను ఆర్పేందుకు 14,000 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 2400కు పైగా ఫైరింజన్లతో రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఇందుకు 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు.

విరుచుకుపడనున్న ‘లారా’

ఇక మరోవైపు పెనుతుపాను ‘లారా’ అమెరికాలోని టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. దీని ఫలితంగా గంటకు 240 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. ఇదే తీవ్రత కొనసాగితే లారా, అమెరికాలో పెను ప్రభావం చూపిన తుపానుల్లో ఒకటిగా నిలిచిపోనుంది. ఈ తుపాను ఇరు రాష్ట్రాల్లో అపార నష్టం కలిగించనుందని నిఫుణులు అంటున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు ఐదు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజల తరలింపు క్లిష్టంగా మారింది. భయంకర తుపానుగా మారే అవకాశమున్న లారా నుంచి తప్పించుకోవటం కష్టమని.. దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం సంభవించ వచ్చనే అభిప్రాయాన్ని వాతావరణ సంస్థ వ్యక్తంచేసింది. లారా ప్రభావంతో ఇళ్లు తీవ్రంగా దెబ్బతినడం, చెట్లు వేళ్లతోసహా కూలిపోవటం, విద్యుత్తు, నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోయే అవకాశం కూడా ఉందని తెలిపింది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని