సైకిల్‌పై విధులకు రాష్ట్ర మంత్రి..!

పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఈ రాష్ట్ర మంత్రి ఆచరణలో పెట్టారు.

Updated : 05 Nov 2020 11:02 IST

లఖ్‌నవూ: విద్యుత్‌ను ఆదాచేయాలని.. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఈ రాష్ట్ర మంత్రి ఆచరణలో పెట్టారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ తన కార్యాలయానికి సైకిల్‌ మీద వెళ్లడం ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహనను పెంచేందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు మంత్రి చెప్పారు. విధినిర్వహణలో భాగంగా నగరంలోని బంగ్లా బజార్‌, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌సెంటర్లకు కూడా  సైకిల్‌ పైనే చేరుకున్న శర్మ.. అక్కడి పనితీరును పర్యవేక్షించారు. అంతేకాకుండా నగరంలోని పలువురు వినియోగదారులను స్వయంగా కలసి విద్యుత్‌ సరఫరా బాగోగులను గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత సమస్యలు ఏవేనా ఉంటే ఉచిత హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబరు 1912కు తెలపాలని విద్యుత్‌ శాఖ మంత్రి శర్మ వారికి వివరించారు. భారీ బకాయిదార్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించడం తమ విధానం కాదని.. వారు తమ బకాయిలను నాలుగు దఫాల్లో కట్టేందుకు అవకాశం కలిగించామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలను చెల్లించాలంటూ వారికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడికక్కడే బిల్లులు చెల్లించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని