వుహాన్‌ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం!

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

Published : 05 Aug 2020 16:39 IST

వుహాన్‌ శాస్త్రవేత్తలతో విస్తృత చర్చ
WHO ముందస్తు నిపుణుల బృందం దర్యాప్తు పూర్తి

జెనీవా: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముందస్తు బృందం చేపట్టిన దర్యాప్తు తాజాగా పూర్తైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

దర్యాప్తులో భాగంగా వైరస్‌కు కేంద్రబిందువుగా భావిస్తోన్న వుహన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలతో ఈ బృందం విస్తృతంగా చర్చించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎపిడెమియోలాజికల్‌ నివేదికలు, బయెలాజికల్‌, జెనెటిక్‌ విశ్లేషణలు, అక్కడి మార్కెట్లలోని జంతు ఆరోగ్య పరిశోధనల గురించి చైనా శాస్త్రవేత్తలతో చర్చించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి క్రిష్టయన్‌ లిండ్‌మియర్‌ విలేకరులకు వెల్లడించారు. అంతేకాకుండా పూర్తి సమాచారాన్ని ఈ బృందం సేకరించిందని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు తుది ఫలితాలు మాత్రం డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించలేదు.

ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడంతో అంతర్జాతీయ నిపుణులతో పూర్తి స్థాయి దర్యాప్తు, పరిశోధన చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. అసలు జంతువుల నుంచి కొవిడ్‌19 మహమ్మారి మానువుల్లోకి ఎలా ప్రవేశించింది? తదితర అంశాలపై పరిశోధన ఈ పూర్తి స్థాయి నిపుణుల బృందం దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తు బృందంలో ఏయే నిపుణులు ఉండాలనే విషయంపై ఇప్పటికే ముసాయిదా‌ను రూపొందించారు. అయితే, ఈ దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలియరాలేదు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో ఈ వైరస్‌కు అసలు కారణం చైనానే అని పలుదేశాలు విమర్శించాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఏకంగా ప్రపంచ ఆరోగ్యసంస్థపైనే విమర్శలు గుప్పించింది. చివరకు ఒత్తిడి పెరగడంతో దర్యాప్తు జరిపేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అంగీకరించింది. వైరస్‌ మూలాలను శోధించేందుకు మూడు వారాల క్రితం ఇద్దరు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల ముందస్తు దర్యాప్తు బృందం చైనాకు వెళ్లింది.
ఇవీ చదవండి..
వుహాన్‌ లేబొరేటరీలో ఏం జరిగింది?
చైనాకు బయలుదేరిన WHO నిపుణుల బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని