క్రిస్మస్‌ రోజు.. ట్రంప్‌ ఏం చేస్తున్నారంటే..

డొనాల్డ్‌ ట్రంప్‌ క్రిస్మస్‌ ముందురోజు (క్రిస్మస్‌ ఈవ్‌) సాయంత్రాన్ని హాయిగా గోల్ఫ్‌ ఆడుతూ గడిపేశారు.

Published : 25 Dec 2020 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ కొవిడ్ ఉపశమన ప్యాకేజీ బిల్లు తిరస్కరణ, మహమ్మారి కారణంగా ప్రభుత్వాన్ని షట్‌డౌన్‌ చేయాలన్న ప్రతిపాదన తదితర వివాదాస్పద నిర్ణయాలను ప్రకటించిన అనంతరం.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్రిస్మస్‌ ముందురోజు (క్రిస్మస్‌ ఈవ్‌) సాయంత్రాన్ని హాయిగా గోల్ఫ్‌ ఆడుతూ గడిపేశారు.

కొవిడ్‌ ఉపశమన చర్యల్లో భాగంగా అర్హత గల అమెరికన్‌ పౌరులకు గతంలో ఆమోదించిన 600 డాలర్ల కంటే ఎంతో అధికంగా రెండు వేల డాలర్లు ప్రత్యక్షంగా అందజేయాలని డెమోక్రటిక్‌ పార్టీ ప్రతిపాదించింది. దీని ప్రకారం సంవత్సరానికి 75 వేల డాలర్లకంటే తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, సంయుక్తంగా 1లక్షా 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన జంటలు 600 డాలర్ల పరిహారం పొందవచ్చు. అంతేకాకుండా వారితోనే నివసించే వారి సంతానానికి కూడా 600 డాలర్ల చొప్పున లభిస్తుంది. కాగా, ఈ ఆలోచననను హౌస్‌ రిపబ్లికన్లు తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన ‘కరోనా రిలీఫ్‌ ప్యాకేజ్‌ బిల్లు’ను వారు వ్యతిరేకించారు.

ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో.. అధ్యక్షుడు ట్రంప్‌ క్రిస్మస్‌ ఈవ్‌ సమయాన్ని, ఫ్లోరిడాలో ఉన్న తన సొంత మైదానం ‘పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ క్లబ్‌’లో గోల్ఫ్‌ ఆడుతూ గడిపారు. స్థానిక కాలమానం ప్రకారం ట్రంప్‌కు గురువారం ఏ అధికారిక కార్యక్రమాలు లేవు. ఐతే క్రిస్మస్‌ సెలవులు లభించినప్పటికీ.. అమెరికా ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన షెడ్యూలు ఎన్నో కీలక సమావేశాలు, మాట్లాడాల్సిన ముఖ్యమైన ఫోన్‌ కాల్స్‌తో నిండిపోయిందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

సారీ చెబితే చైనీయులను వదిలేస్తాం..

మార్కెట్లోకి తొలి దేశీ నియోనియా టీకా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని