ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళల మార్చ్‌

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమీ కోనే బ్యార్రెట్‌ పేరును ప్రతిపాదించిన డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలన విభాగంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళా నిరసనకారులు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు...

Published : 18 Oct 2020 20:50 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బ్యార్రెట్‌ పేరును ప్రతిపాదించడంపై అభ్యంతరాలు

వాషింగ్టన్‌: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమీ కోనే బ్యార్రెట్‌ పేరును ప్రతిపాదించిన డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలన విభాగంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళా నిరసనకారులు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. దేశంలోని పలు నగరాల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు రాజధాని వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ఏడాదిలో నిరసనకారులు చేపట్టిన రెండో ర్యాలీ ఇది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రుత్‌ బాడెర్‌ గిన్స్‌బర్గ్‌ మృతికి సంతాపం తెలుపుతూ, నూతన న్యాయమూర్తిగా బ్యార్రెట్‌ పేరును ప్రతిపాదించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ట్రంప్‌నకు ఓటు వేయొద్దంటూ అధ్యక్షుడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఫ్రీడమ్‌ ప్లాజా నుంచి నేషనల్‌ మాల్‌ వరకు వారి ప్రదర్శన సాగింది.

న్యాయమూర్తిగా ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆమీ కోనే బ్యార్రెట్‌ అధికార రిపబ్లికన్‌ పార్టీకి అనుకూలంగా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. నవంబర్‌ 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ట్రంప్‌ మద్దతుదారులు సుప్రీంకోర్టు ఎదుట గుమిగూడి నిరసనలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని