Published : 15/09/2020 11:14 IST

భారత్‌తో కయ్యం.. జిన్‌పింగ్‌ సీటుకే ఎసరు!

అంతర్జాతీయ పత్రిక ‘న్యూస్‌వీక్‌’లో ఆసక్తికర కథనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో కయ్యానికి విఫలయత్నం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన సీటు కిందకు తానే నీరు తెచ్చుకుంటున్నారు. భారత్‌ని కవ్వించి భంగపడ్డ ఆయన తన ప్రాబల్యం తగ్గిందని తానే బహిర్గతం చేసుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంట అతిక్రమణలకు పాల్పడి ఏకంగా తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టుకుంటున్నారు. ఈ మాటలు అన్నది అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు గోర్డన్‌ జీ చాంగ్‌. ‘ది కమింగ్‌ కొలాప్స్‌ ఆఫ్‌ చైనా’ అనే పుస్తకం రాసిన ఈయన భారత్‌తో చైనా వివాదాలపై తన అభిప్రాయాల్ని ‘న్యూస్‌వీక్‌’ అనే ప్రముఖ అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం..

భారత్‌పై చైనా దుందుడుకు వైఖరిని పథక రచన చేసింది షీ జిన్‌పింగే. ఆయన అధికారం చేపట్టిన తర్వాత భారత్‌ పట్ల చైనా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వాస్తవాధీన రేఖ వెంట జరిగిన అతిక్రమణలు ఘోరంగా విఫలమయ్యాయి. జిన్‌పింగ్‌ ఒత్తిడితో ముందుకు సాగిన ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ అనేక ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వచ్చింది. భారత్‌ను ఎదుర్కోలేక చావు దెబ్బ తిన్న జిన్‌పింగ్‌ పరువు దక్కించుకొనేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని గోర్డన్‌ విశ్లేషించారు.

1962 యుద్ధం తర్వాత భారత్‌ రక్షణాత్మక ధోరణి అవలంబిస్తూ వస్తుండడంతో చైనా అనేక సార్లు దాన్ని అదునుగా వాడుకొని అతిక్రమణలకు పాల్పడిందని గోర్డన్‌ చెప్పకొచ్చారు. అయితే, భారత్‌ వైఖరి ప్రస్తుతం చాలా మారిందని.. ప్రతిదాడికి ఏమాత్రం వెనుకాడడం లేదని విశ్లేషించారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణను అందుకు నిదర్శనంగా ఉటంకించారు. ఈ దాడిలో భారత్‌కు చెందిన సైనికులు 20 మంది మరణించగా.. చైనా 43 మందిని కోల్పోయిందని గుర్తుచేశారు. ఇక ఇటీవల పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడం పట్ల చైనా సైతం కంగు తిన్నదని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ను చైనా ఏ మేరకు ఎదుర్కోగలదన్నది ప్రశ్నార్థకమేనని తెలిపారు. చివరి సారిగా 1979లో వియత్నాంతో చైనా నేరుగా సైనిక ఘర్షణకు దిగింది. దీంట్లో చైనా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. అనంతరం భారీ స్థాయిలో సైనిక, ఆయుధ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. అయినా, యుద్ధ క్షేత్రంలో వారి సామర్థ్యం తగిన స్థాయిలో లేదని తాజా ఘటనల్ని చూస్తే అర్థమవుతోందని గోర్డన్‌ అభిప్రయపడ్డారు.

ఆక్రమణదారులకు భారత్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. సరికొత్త ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో షీ జిన్‌పింగ్‌ తన ప్రభావాన్ని చాటుకునేందుకు మరోసారి పీఎల్‌ఏను వాడుకోవచ్చు. భారత్‌ పైకి దాడికి ఎగదోయవచ్చు. ఇలా తన రాజకీయ ప్రయోజనాల కోసం జిన్‌పింగ్‌ మిలిటరీని విస్తృత స్థాయిలో వాడుకోవడం పీఎల్‌ఏలోని ఓ వర్గానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ సారి జిన్‌పింగ్‌ ఒత్తిడికి తలొగ్గి భారత్‌పై ఘర్షణకు దిగినా పై చేయి సాధించడం మాత్రం అనుమానమే. అదే జరిగితే పీఎల్‌ఏలో ఆయనపై ఉన్న వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మాజీ సైనికుల పట్ల జిన్‌పింగ్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై చైనా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా భారత్‌తో తలపడుతూ.. జిన్‌పింగ్‌ తన సీటుకే ఎసరు పెట్టుకుంటున్నారని గోర్డన్‌ విశ్లేషించారు. పొరుగుదేశాల్ని బెదిరింపులతో లొంగదీసుకోవాలన్న జిన్‌పింగ్‌ వైఖరి ఇప్పటికే బెడిసి కొడుతున్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని