టిక్‌టాక్‌ నిషేధంపై జుకర్‌బర్గ్ ఆందోళన 

అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధంపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 08 Aug 2020 01:15 IST

కాలిఫోర్నియా: అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధంపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కంపెనీ ఆల్‌హ్యాండ్స్ మీటింగ్‌లో టిక్‌టాక్‌ గురించి ప్రశ్నించగా మార్క్‌ నుంచి ఈ సమాధానం వచ్చింది. అలాగే టిక్‌టాక్‌ కొనుగోలుపై ఫేస్‌బుక్‌ నిర్ణయమేంటని అడగ్గా..పూర్తి స్థాయి కంపెనీ సమావేశంలో ఆ విషయాలు వెల్లడించడం కుదరదని చెప్పారు. అయితే తనకు పోటీదారుగా భావించిన యాప్స్‌‌, కంపెనీలను ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఇన్‌స్టాగ్రాం. కాగా, సెప్టెంబరు 15లోగా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను ఏదైనా అమెరికా కంపెనీ కొనుగోలు చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమైన మైక్రోసాఫ్ట్ చర్చలు కూడా జరుపుతోంది. 

జుకర్‌బర్గ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ..టిక్‌‌టాక్‌ యాప్‌తో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని ఒప్పుకుంటూనే, అమెరికాలో టిక్‌టాక్‌, బైట్డ్యాన్స్‌ మీద వేటు వేసిన తీరుగానే, ఫేస్‌బుక్‌ కూడా వేరే దేశానికి లక్ష్యం కావొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. చైనాలోకి తిరిగి ప్రవేశించాలన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లిన తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో ఫేస్‌బుక్ మీద సెన్సార్‌షిప్ ఉంది. 

ఇదిలా ఉండగా..టిక్‌టాక్‌ నిషేధంతో భారత్‌లో ఏర్పడిన ఖాళీని తాజాగా లాంచ్‌ చేసిన రీల్స్‌ యాప్‌తో పూడ్చాలనుకుంటోంది ఫేస్‌బుక్. యూఎస్‌లో నిషేధం అమల్లోకి వస్తే మరింత అవకాశం దొరకనుంది. కానీ ఈ నిషేధం వల్ల ఫేస్‌బుక్‌కు లాభం మధ్యస్థంగానే ఉంటుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోజనం స్వల్పకాలమైనదేనని, దాని కోసం కంపెనీని నడపలేమని చెప్పుకొచ్చారు. అయితే సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఫేస్‌బుక్‌కు గుత్తాధిపత్యం లేకపోవడానికి టిక్‌టాక్‌ కారణమని ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ జరిపిన విచారణలో భాగంగా జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని