కొవిడ్‌-19: ఏడాది గడిచినా..WHO ముందు సవాళ్లే!

ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఏడాది అయ్యింది.

Published : 11 Mar 2021 17:46 IST

మహమ్మారిని ఎదుర్కోవడంలో వెనుకబాటు

జెనీవా: ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఏడాది అయ్యింది. ఇప్పటివరకు 26లక్షల మందిని పొట్టనబెట్టకున్న మహమ్మారిని ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌ఓ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే విషయంతో పాటు ఇతర అంశాల్లో ప్రపంచ దేశాలను సమాయత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ‌ వెనుకబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ అనతి కాలంలోనే అన్ని దేశాలకు విస్తరించింది. తొలిసారి జనవరి 30, 2020 నాడు ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయికస్థితి’పై డబ్ల్యూహెచ్‌ఓ తొలి వార్నింగ్‌ ఇచ్చింది. కానీ, ప్రపంచ దేశాలు మాత్రం అంతగా పట్టించుకోలేదు. మార్చి 11వ తేదీన కొవిడ్‌-19 భూతాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘మహమ్మారి’గా ప్రకటించి ప్రపంచ దేశాలను మరింత అప్రమత్తం చేసింది. ఇక్కడివరకు భాగానే ఉన్నా..కొవిడ్‌-19ను నియంత్రించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ చేరవేయడం వరకు డబ్ల్యూహెచ్‌ఓ సరైన రీతిలో వ్యవహరించడం లేదనే వాదన ఉంది.

హెచ్చరికల్లోనూ ఆలస్యమే..

కొవిడ్‌ -19 మహమ్మారిపై పోరులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పడం, ఈ వైరస్‌ గాలిలో వ్యాపిస్తుందన్న విషయాన్ని తేల్చడానికి డబ్ల్యూహెచ్‌ఓ కొన్నినెలల సమయం తీసుకుంది. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని జూన్‌లో ప్రకటన చేసిన విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. మాస్కుల ప్రకటనపై డబ్ల్యూహెచ్‌ఓ చేసిన ఆలస్యం ఎన్నో లక్షల ప్రాణాలు కోల్పోవడానికి పరోక్షంగా కారణమయినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు డాక్టర్‌ ట్రిష్ గ్రీన్‌హాల్గ్‌ పేర్కొన్నారు. వీటితో పాటు వైరస్‌ మూలాల సమాచారాన్ని రాబట్టడంలో చైనాపై ఒత్తిడి తేలేకపోయిందనే అపవాదు మూటగట్టుకుందన్నారు.

మూలాలపైనా అదే నిర్లక్ష్యం..

ప్రమాదకరమైన కొవిడ్‌-19 వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని వెల్లడించిన ఆరు వారాల తర్వాత దీన్ని ‘మహమ్మారి’గా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ ప్రకటించారు. కానీ అప్పటికే ఒక్క అంటార్కిటికా తప్ప దాదాపు అన్ని ఖండాలకు ఈ వైరస్‌ పాకిపోయింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల మందిలో బయటపడగా 26లక్షల మందిని బలితీసుకుంది. అయితే, మహమ్మారిగా ప్రకటించి ఏడాది గడుస్తున్నప్పటికీ కొవిడ్‌ మూలాలపై ఎటూ తేల్చలేకపోయింది. అంతేకాకుండా చైనాలో కొవిడ్‌ మహమ్మారి ప్రబలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వ తీరుపై చైనా  ఉన్నతాధికారులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, చైనా ప్రభుత్వాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించడం ఆ సంస్థపై విమర్శలు రావడానికి కారణమయ్యింది. వైరస్‌ కట్టడిపై డబ్ల్యూహెచ్‌ఓ పలుసార్లు చైనాను ప్రశంసించడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిందని డబ్ల్యూహెచ్‌ఓ మాజీ న్యాయ సలహాదారు గియాన్‌ బుర్‌సీ పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ముందు జాగ్రత్తలను సూచించడం కంటే అన్ని దేశాలను మరింత అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ వెనుకబడిందని అభిప్రాయపడ్డారు.

వాక్సిన్‌ల పంపిణీలోనూ..

కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ వ్యాక్సిన్‌ను పేద దేశాలకు అందించే లక్ష్యంతో ‘కొవాక్స్‌’ను ఏర్పాటు చేసింది. కానీ, అన్ని దేశాలకు సరిపోయే వ్యాక్సిన్‌ డోసులను సమకూర్చడంలో వెనుకబడింది. ముఖ్యంగా ఆయా దేశాలు చేసుకుంటున్న ప్రైవేటు ఒప్పందాలను పర్యవేక్షించి, వాటిని నియంత్రించడంలో విఫలమయ్యిందనే వాదన ఉంది. దీంతో చాలా పేద దేశాలకు వ్యాక్సిన్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేకపోయినట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పేద దేశాలకు సానుభూతి చూపించి వ్యాక్సిన్‌ అందేలా చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. కానీ, ధనిక దేశాలు మాత్రం వారి సొంత నిర్ణయాలతోనే ముందుకు వెలుతున్నాయిని నిపుణులు చెబుతున్నారు. ఇలా కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి వ్యాక్సిన్‌ వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. ఇందుకు ఆ సంస్థలో సమర్థమైన నిపుణుల లేమి కూడా ఓ కారణంగా చూపుతున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని