చొరబాటుకు సిద్ధంగా 135 మంది ముష్కరులు.. దేశంలో భారీఉగ్ర కుట్ర!

గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద (ఎల్​ఓసీ) ఎదురుచూస్తున్నారని......

Published : 25 Jan 2022 01:18 IST

దిల్లీ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద (ఎల్​ఓసీ) ఎదురుచూస్తున్నారని కశ్మీర్​ బీఎస్​ఎఫ్ ఇన్​స్పెక్టర్ జనరల్​ (ఐజీ) రాజాబాబు సింగ్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్​ అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు డ్రైవ్​లు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం సరిహద్దు వద్ద పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నట్లు తెలిపారు.

‘దేశంలోకి చొరబడేందుకు ఎల్​ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచాం. ప్రస్తుతం పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయి’ అని బీఎస్​ఎఫ్​ ఐజీ వెల్లడించారు. గతంతో పోలిస్తే 2021లో చొరబాటులు తగ్గాయని ఆయన తెలిపారు. గతేడాది 58 మంది దేశంలోకి చొరబడేందుకు యత్నించారని, అందులో ఐదుగురిని కాల్చేసినట్లు పేర్కొన్నారు. 21 మంది తిరిగి వెనక్కి వెళ్లిపోగా.. ఒకరు లొంగిపోయినట్లు తెలిపారు. మొత్తం 31 మంది చొరబడినట్లు వెల్లడించారు. 2020లో 36 మంది, 2019లో 130 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్లు రాజాబాబు సింగ్ స్పష్టం చేశారు.

తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను ఐజీ ఈ సందర్భంగా కొట్టిపారేశారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. డ్రోన్​ ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపారు. ‘గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్​​ విధానాలతో ఆ చర్యలను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని బీఎస్‌ఎఫ్‌ ఐజీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని