Varun Gandhi: సాగు చట్టాల రద్దు ఓకే.. మోదీజీ ఈ డిమాండ్లు కూడా తీర్చండి: వరుణ్ గాంధీ లేఖ

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు ఆది నుంచి తన మద్దతు తెలుపుతున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. తాజాగా మరోసారి ఈ విషయంపై

Updated : 20 Nov 2021 15:46 IST

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు ఆది నుంచి తన మద్దతు తెలుపుతున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ నిన్న చేసిన ప్రకటనను స్వాగతించిన ఆయన.. కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. లేదంటే అన్నదాతల ఉద్యమం ఆగదని అభిప్రాయపడ్డారు. లఖింపూర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ మేరకు ప్రధాని మోదీకి వరుణ్‌ బహిరంగ లేఖ రాశారు.

రూ.కోటి పరిహారం ఇవ్వండి..

‘‘సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని గత ఏడాది కాలంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభించింది. చట్టాలను రద్దు చేస్తామని మీరు(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు. అయితే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఈ ఉద్యమంలో పోరాడుతూ 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ ఈ నిర్ణయం(చట్టాల రద్దుపై) గనుక ముందే తీసుకుంటే.. ఆ అమాయక ప్రాణాలను పోగొట్టుకునేవాళ్లం కాదుగా. అందువల్ల నేను కోరుతున్నది ఏంటంటే.. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వండి. అంతేగాక, ఉద్యమంలో భాగంగా రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టేయండి’’ అని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

అప్పటిదాకా ఉద్యమం ఆగదు..

‘‘మన దేశంలో 85శాతం మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే. వారికి సాధికారత దక్కాలంటే వారి పంటలకు తగిన మద్దతు ధర లభించాలి. అందుకే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పరిష్కరించేంతవరకు వారి ఉద్యమం ఆగదు. అందువల్ల రైతుల పంటకు చట్టపరమైన మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం అంగీకరించాలని కోరుతున్నా. ఇది వారికి ఆర్థికపరమైన భద్రత కల్పిస్తుంది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

లఖింపుర్‌ ఘటనపై చర్యలు తీసుకోండి..

‘‘ఆందోళన చేస్తోన్న రైతులపై చాలా మంది రాజకీయ నేతలు రెచ్చగొట్టే, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 3న లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనల్లో రైతు సోదరులు మరణించారు. ఆ హృదయవిదారక ఘటన.. మన ప్రజాస్వామ్యంపై మాయని మచ్చగా మారింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అప్పుడే ఘటనపై పారదర్శకమైన విచారణకు వీలవుతుంది’’ అని వరుణ్‌ లేఖలో తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని