Published : 30/08/2021 18:26 IST

National Security: ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా తిప్పికొట్టగలం: రాజ్‌నాథ్‌

చండీగఢ్‌: తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు భద్రతాపరమైన కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా, అప్రమత్తతో ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. భాజపా సీనియర్‌ నేత బలరామ్‌ దాస్‌ టాండన్‌ మూడో వర్థంతి సందర్భంగా జాతీయ భద్రత అంశంపై పంజాబ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని స్మారకోపన్యాసం చేశారు. అఫ్గానిస్థాన్‌లో పరిణామాలను ఆసరాగా తీసుకొని సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశ వ్యతిరేకశక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.  అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న అంశాలు భద్రతాపరమైన కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడి పరిణామాలను మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు సరిహద్దుల నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఇవ్వరాదన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉందన్నారు.

దృఢమైన భారతదేశమే లక్ష్యంగా..

వాయు, జల, భూ మార్గాల్లో ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు చెప్పారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి దృష్ట్యా కొత్త తరహా సవాళ్లు ఎదురవుతున్నాయన్న కేంద్ర రక్షణ మంత్రి.. జమ్మూ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద ఇటీవల డ్రోన్లతో రెండు బాంబులను విడిచిపెట్టిన ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం జాతీయ భద్రతా వ్యవస్థను అప్‌డేట్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. భారత్‌ను బలమైన, దృఢమైన, సురక్షితమైన దేశంగా నిలపడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. భారత్‌- పాక్‌ మధ్య అపనమ్మకాలు ఉందన్న ఆయన.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించడం ద్వారా సాధించేదేమీ లేదని పాకిస్థాన్‌ గ్రహించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

పాక్‌.. ఉగ్రవాదులకు ఓ నర్సరీ

1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో పరాజయం పాలైన పాకిస్థాన్‌కు భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధం చేసే పరిస్థితి లేదని రుజువైపోయిందన్నారు. మనతో నేరుగా తలపడే ధైర్యం లేని పాకిస్తాన్‌ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు, ఆర్థికవనరులను సమకూర్చడం ద్వారా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. 1980ల తర్వాత ప్రపంచం మొత్తంలోనే పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి ఓ నర్సరీగా మారిపోయిందన్నారు. గత ఏడేళ్లుగా భారత సైన్యం ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొడుతున్నాయని చెప్పారు. కశ్మీర్‌లో మిగిలిన ఉగ్రవాదం కూడా అంతమవుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఎందుకంటే వేర్పాటువాద శక్తుల బలోపేతానికి ప్రాణవాయువుగా ఉన్న ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు చేసినందువల్లే తానీ మాట చెప్పగలగుతున్నానన్నారు. దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్‌ రాజకీయాలు చేయదు.. అనుమతించదన్నారు. తమ విధులు నిర్వర్తించడంలో సైన్యానికే పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు.

చైనాతో వివాదం చర్చలతోనే పరిష్కారం

పొరుగుదేశం చైనాతో సరిహద్దు వివాదం చర్చలతో పరిష్కారమవ్వాలని భారత్‌ కోరుకుంటోందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఏకపక్ష చర్యలను భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదని, సరిహద్దుల్లో నిబంధనల ఉల్లంఘనను అనుమతించేదది లేదని తేల్చి చెప్పారు.  ‘‘సరిహద్దు విషయమై భారత్‌, చైనా మధ్య విభేదాలున్నాయి. వాటిని పక్కనబెడితే వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ప్రొటోకాల్స్‌ ఉన్నాయి. అయితే వీటిని చైనా బలగాలు విస్మరించాయి’’ అని గతేడాది తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించడం వల్లే ఆ రోజు(గల్వాన్‌ ఘర్షణలను ఉద్దేశిస్తూ) గల్వాన్‌లో చైనా బలగాలను భారత జవాన్లు అడ్డుకుని వెనక్కి పంపించారని తెలిపారు. ‘‘దేశ సరిహద్దులు, ఆత్మగౌరవం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాజీపడదు. చైనాతో సరిహద్దు వివాదం చర్చల ద్వారా పరిష్కారం అవ్వాలని భారత్‌ కోరుకుంటోంది. అయితే సరిహద్దుల పవిత్రతను ఉల్లంఘించడాన్ని సహించేది లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల ఏకపక్ష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు’’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఇక సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. రోహ్‌తంగ్‌లో అటల్‌ టన్నల్‌ ప్రాజెక్టును పూర్తిచేశామని, వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన సొరంగమని చెప్పారు. లద్దాఖ్‌లోనూ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని