Afghanistan: దేశం దాటించాలని విదేశీ బలగాలను వేడుకుంటున్న ప్రజలు

తాలిబన్ల రాక్షస పాలనకు భయపడి వేలాదిమంది అఫ్గానిస్తాన్ ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లేందుకు కాబుల్ విమానాశ్రయం వద్ద పడిగాపులుకాస్తున్నారు. తమని తాలిబన్ల చెర నుంచి రక్షించి సరిహద్దులు దాటించాలని....

Published : 22 Aug 2021 01:01 IST

కాబుల్‌: తాలిబన్ల రాక్షస పాలనకు భయపడి వేలాదిమంది అఫ్గానిస్థాన్‌ ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులుకాస్తున్నారు. తమను తాలిబన్ల చెర నుంచి రక్షించి సరిహద్దులు దాటించాలని అమెరికన్, బ్రిటన్ బలగాలను వేడుకుంటున్నారు. పిల్లాపాపలతో వేలాదిగా అఫ్గాన్ ప్రజలు విమానాశ్రయానికి తరలివస్తుండటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. తమను ఎలాగైన దేశం దాటించాలని విదేశీ బలగాలను వారు బతిమాలుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అందరూ ఊహించినట్లుగానే రాక్షస పాలనకు తెరలేపారు. ఇష్టారీతిన ప్రవర్తిస్తూ తమకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి తప్పించుకొని దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రజలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దులు దాటేందుకు ఏకైక మార్గంగా ఉన్న కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిపోతున్నారు. దీనికితోడు తాలిబన్లపై పోరులో సహాయ సహకారాలు అందించిన వారందరినీ అఫ్గాన్‌ నుంచి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇవ్వడంతో భారీగా ప్రజలు విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

ప్రస్తుతం 10వేలకు పైగా అఫ్గాన్లు కాబుల్‌ విమానాశ్రయంలో తమ తరలింపు కోసం ఎదురుచూస్తున్నారు. మరింత మంది ఎయిర్‌పోర్టుకు తరలి వస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. తనిఖీల అనంతరం కొంతమందిని మాత్రమే బలగాలు విమానాశ్రయంలోనికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ వద్ద భావోద్వేగ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దేశం విడిచి ఎలాగైనా ప్రాణాలతో బయటపడితే చాలన్న రీతిలో.. ముక్కూ, మొహం తెలియని విదేశీ బలగాలను వారు వేడుకుంటున్న దృశ్యాలు హృదయాలను కదిలించివేస్తున్నాయి. తమ ఇళ్లు, ఆస్తులు అన్నీ విడిచిపెట్టి విమానాశ్రయంలో గంటల కొద్దీ వేచి ఉంటూ వారు చేస్తున్న నిరీక్షణ పోరాటం హృదయాలను ద్రవింపజేస్తోంది. తాలిబన్ల రావణకాష్ఠం నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు అన్న భావన అఫ్గాన్‌ ప్రజల ముఖాల్లో కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని