మాకు అమెరికాయే అతిపెద్ద శత్రువు: కిమ్‌

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్‌ అమెరికాపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు అతిపెద్ద శత్రువు అమెరికాయేనని ప్రకటించారు. అగ్రరాజ్య శతృత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు......

Published : 09 Jan 2021 13:19 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్‌ అమెరికాపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు అతిపెద్ద శత్రువు అమెరికాయేనని ప్రకటించారు. అగ్రరాజ్య శతృత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా తమ అణుకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. అయిదేళ్ల తర్వాత జరుగుతున్న అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశంలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ పేర్కొంది.

శ్వేతసౌధంలో ఎవరున్నా.. ఉత్తర కొరియాపై అమెరికా విధానం మారదని కిమ్‌ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో సత్సంబంధాలు ఏర్పడాలంటే శతృత్వానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు మరింత బలమైన, అత్యాధునిక ఆయుధాల్ని తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిఘా ఉపగ్రహాలు, అణు జలాంతర్గాములు, నీటిలో ప్రయోగించగల క్షిపణులను అభివృద్ధి చేయాలని సూచించారు.

అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైన తర్వాత అమెరికాపై కిమ్ ఇప్పటి వరకు మౌనం వహిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో అమెరికాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతోనూ సఖ్యత ఉండబోదని పరోక్షంగా హెచ్చరించారు. తమ అభివృద్ధికి ఆటంకంగా మారిన అమెరికాను అణచివేయడంపై దృష్టి సారిస్తామని కిమ్‌ ప్రకటించారు. ఉత్తర కొరియా ఎంత ప్రయత్నించినప్పటికీ.. అమెరికాతో సంబంధాలు మరింత దిగజారాయని పేర్కొన్నారు. పలుసార్లు ట్రంప్‌, కిమ్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఇరు దేశాల మధ్య వివాదాలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు.

మరోవైపు ఇటీవల ఓ సందర్భంలో బైడెన్‌ మాట్లాడుతూ.. కిమ్‌ దుండుగుడు, నియంత అని సంబోధించారు. ఎలాంటి షరతులు లేకుండా కిమ్‌తో సమావేశమయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ హయాంలోనూ ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనపడడం లేదు.

ఇవీ చదవండి..

ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిది

ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని