Afghanistan: ముగిసిన రెండు దశాబ్దాల యుద్ధం!

ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బగ్రం వైమానిక స్థావరం.....

Updated : 02 Jul 2021 18:32 IST

అఫ్గానిస్థాన్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించిన అమెరికా బలగాలు

కాబూల్‌: ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బాగ్రం వైమానిక స్థావరం నుంచి తమ దేశాలకు వెళ్లిపోయినట్లు అధికారిక సమాచారం. దీంతో అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని నిపుణులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఐరోపా దేశాల బలగాలు సైతం వెనక్కి వెళ్లాయి. అఫ్గాన్‌లో తమ మిషన్‌లు ముగిశాయని, సైనికులంతా స్వదేశాలకు చేరుకున్నారని జర్మనీ, ఇటలీ ఇటీవలే ప్రకటించాయి. పోలండ్‌ కూడా పూర్తిస్థాయిలో తమ సైనికులను వెనక్కి రప్పించుకుంది.

భారీ బాగ్రం

రెండు దశాబ్దాల యుద్ధానికి బాగ్రం వైమానిక స్థావరం కేంద్ర బిందువుగా ఉంది. తాలిబన్‌, అల్‌ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఇక్కడి నుంచే కొనసాగాయి. దాదాపు 10 వేల మంది సైనికులకు కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావాల్సిన సకల వసతులు ఇక్కడ ఉండేవి. అల్‌ఖైదాతో పోరులో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను బంధించిన పెద్ద జైలు కూడా ఉంది. 80వ దశకంలో అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. దేశ రాజధాని కాబూల్‌కు ఇది 40 కి.మీ దూరంలో ఉంటుంది.

2,442 మంది అమెరికన్‌ సైనికుల మరణం..

గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లో యుద్ధం కోసం అమెరికా రూ.148 లక్షల కోట్లు (2లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనా వేసింది. అంతర్యుద్ధంలో 47,245 మంది అఫ్గాన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 69 వేల మంది వరకూ అఫ్గాన్‌ సైనికులు మరణించి ఉంటారని అంచనా. అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 3,800మంది మృతి చెందారు. నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయినా సుదీర్ఘ కాలంగా పోరు కొనసాగించారు. 50శాతం వరకు అఫ్గానిస్థాన్‌ భూభాగం వారి ఆధిపత్యంలోనే ఉందని అంచనా.

సెప్టెంబరు వరకు  గడువు..

గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. అమెరికాకు చెందిన 2500 మంది సైనికులు, నాటో కూటమికి చెందిన 7 వేల మంది సైనికులు అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్లాలి. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్‌ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 8 నాటికి సగం బలగాలను అమెరికా  వెనక్కి రప్పించింది. చివరగా మిగిలిన 2500-3500 అమెరికన్‌ సైనికులు సైతం నేడు అఫ్గాన్ నుంచి నిష్క్రమించారు.

మరి ముందే ఎందుకు..

అయితే బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారు వచ్చేశారు. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్‌ ప్రాంతాన్ని సైతం ఆక్రమించారు. ఇలా తాలిబన్ మూకలు శరవేగంగా పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా బలగాలు ముందుగానే అఫ్గాన్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.

భారత్‌కు తీవ్ర ఆందోళనకరం..

అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లడం భారత్‌కు తీవ్ర ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. తాలిబన్ల ముప్పు అధికమవుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద సహాయకురాలిగా పనిచేసిన లిసా కర్టిస్‌ చెప్పారు. ‘‘1990లో అఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలో ఉన్నప్పుడు వారు ప్రపంచంలోని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి శిక్షణ ఇచ్చారు. నిధులు సమకూర్చారు. వారిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు 2001లో భారత్‌ పార్లమెంటుపైనే దాడికి దిగారు. తాలిబన్ల అధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ ఉగ్రవాదులకు సురక్షిత కేంద్రాలే’’ అని చెప్పారు. ఉగ్రవాదం మళ్లీ పెరిగితే సైనికుల ప్రాణత్యాగాలకు అర్థం ఉండదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అఫ్గాన్‌లో శాంతి నెలకొనడానికి పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, రష్యా, చైనా, భారత్‌, టర్కీలు ఎంతో చేయగలవని ఇటీవల బైడెన్ హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని