Pakistan drone: జమ్మూలో ఆయుధాలు జారవిడిచిన పాక్ డ్రోన్‌!

పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్ భారత సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచినట్లు పోలీసులు గుర్తించారు....

Updated : 03 Oct 2021 12:57 IST

జమ్మూ: పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్ భారత సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఓ ఏకే-47 తుపాకి, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోప్‌ను ప్యాక్‌ చేసి వదిలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో ఉన్న సౌజానా గ్రామంలో వీటిని గుర్తించారు. శనివారం రాత్రి శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూసిన ఓ స్థానికుడు.. డ్రోన్ ఏదో వస్తువులను జారవిడుస్తున్నట్లు గుర్తించాడు. తిరిగి అది పాకిస్థాన్‌ వైపు వెళ్లినట్లు పసిగట్టాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపాడు.

భద్రతా బలగాలతో కలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. సౌజానా గ్రామాన్ని మొత్తం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో వారికి పసుపు రంగులో ఉన్న ఓ ప్యాకెట్‌ లభ్యమైంది. అందులో పైన తెలిపిన ఆయుధాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భారత్‌లో ఈ ఆయుధాలను ఎవరు తీసుకోవాల్సి ఉందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గత ఏడాది కాలంగా పాక్‌ నుంచి భారత భూభాగంలోకి డ్రోన్ సాయంతో ఆయుధాలు వస్తున్న విషయం తెలిసిందే. పలుసార్లు వీటిని పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది జూన్‌లో జమ్మూలోని విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి తర్వాత సరిహద్దుల్లోనూ భద్రతను పటిష్ఠం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని