
మోదీ పర్యటన వేళ.. ఆయుధాలు స్వాధీనం!
గువహటి: అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆయుధాలు బయటపడటం కలకలం సృష్టించింది. జిల్లాలోని గొస్సయిగావ్ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ ఏప్రిల్ 1న జిల్లా పర్యటనకు రానున్నారు. ‘జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మూడు ఏకే56 రైఫిల్స్, మరో మూడు ఏకే 56 మ్యాగ్జిన్లు కనుగొన్నాం. వాటితో పాటు 157 రౌండ్ల బుల్లెట్లను సైతం స్వాధీనం చేసుకున్నాం. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు.
అసోం అదనపు డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 1న ప్రధాని మోదీ కోక్రఝర్లో పర్యటించనున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఏదో కుట్రకు తెరతీసి ఉంటారని అనుమానిస్తున్నాం. వారి ప్రణాళిక ఏంటనే విషయం తెలియదు. గొస్సాయిగావ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.