చైనాను తిప్పికొట్టి దేశంలో ధైర్యం నింపారు: రాజ్‌నాథ్‌

భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం తన అద్భుతమైన ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, మన వీర సైనికులు .........

Updated : 16 Jan 2021 21:41 IST

లఖ్‌నవూ: భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు. శనివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కొత్త కమాండ్‌ ఆస్పత్రికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటోందన్నారు. ఈ మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పుడు హోలీ, ఈద్‌, దీపావళి వంటి పర్వదినాలను సరదాగా జరుపుకోలేమని ఎవరూ ఊహించలేదని చెప్పారు. రైళ్లు నిలిచిపోతాయని, పాఠశాలలు, మార్కెట్లు మూతబడతాయని కూడా ఎవరూ అనుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటానికి ధైర్యంగా ముదుకు సాగామన్నారు. కరోనా వైరస్ ఓ పెను సవాల్‌గా మారి పరీక్షించిందని తెలిపారు.

 

కరోనా యోధులారా.. మీ నిబద్ధతకు సెల్యూట్‌!

కొవిడ్‌ కష్టసమయంలో మన దేశంలో వెంటిలేటర్లు, మాస్క్‌లు, పీపీఈ కిట్ల కొరత ఉండేదని, ఈ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్లడంతో కేవలం నాలుగు నుంచి ఆర్నెళ్లలోనే వీటి కొరతను అధిగమించగలిగామన్నారు. అంతేకాదు, ఇతర దేశాలకు సైతం వీటిని ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరామని తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ముందువరుసలో నిలిచిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల నిబద్ధతను, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. రెండు దేశీయ టీకాల పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైందన్న ఆయన.. మరో నాలుగు టీకాలు త్వరలోనే రాబోతున్నాయన్నారు. ఈ టీకాలు కేవలం భారత దేశ ప్రజలకే కాదని, ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తామన్నారు. భారత్‌ కేవలం తన గురించే ఆలోచించదని, ప్రపంచం గురించి కూడా ఆందోళన చెందుతుందన్నారు. వసుధైక కుటుంబం అనే సందేశంతో ముందుకెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

కన్నీటి పర్యంతమైన మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని